కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తీపికబురు చెప్పబోతుంది. పోలీస్ నియామకాల్లో (Police Recruitment) భాగంగా సుమారు 5 వేల ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాబోతుందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే పోలీస్ శాఖ నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించగా.. ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే.. పోలీస్ నియామక మండలి ద్వారా నోటిఫికేషన్ విడుదల కానుంది. పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఓ వైపు పదోన్నతులు.. మరోవైపు ఖాళీలు
పోలీస్ శాఖలో సుమారు 19 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గతంలోనే ప్రభుత్వానికి స్పష్టమైన నివేదిక అందింది. తక్షణమే కనీసం 8 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తేనే.. సిబ్బందిపై ఒత్తిడి తగ్గుతుందని కూడా ప్రతిపాదించింది. అయితే రిజర్వేషన్లు, ఇతర అంశాల కారణంగా నోటిఫికేషన్ విడుదల ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల నుంచి సీఐల వరకు పదోన్నతుల ప్రక్రియ ఊపందుకుంది. ఖాళీలు ఏర్పడే అవకాశం ఉండటంతో తక్షణమే సుమారు 5 వేల వరకు భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

