కలం, మెదక్ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల పరిస్థితి ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) ప్రశ్నించారు. శనివారం మెదక్ జిల్లా రామాయంపేటలో మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఫసల్ బీమా పథకం అమలులో ఉండి ఉంటే అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం లభించేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే చేర్చాలని అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని ఆయన (Ramchander Rao) డిమాండ్ చేశారు. మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ వైఖరి మహిళలను మోసం చేసే విధంగా ఉందని రామచందర్ రావు మండిపడ్డారు.

