కలం, వెబ్ డెస్క్: తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో (Elections) రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయింది. బెంగాల్‌లో 91.46 శాతం, తమిళనాడులో 84.41 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగినా.. ఆ తరువాత పోలింగ్ కేంద్రాలకు వచ్చేవారి సంఖ్య భారీగా పెరిగింది. తమిళనాడులో 234 నియోజకవర్గాలకు ఈ రోజు ఒకే దశలో పోలింగ్ జరిగింది. బెంగాల్‌లోని మొత్తం 294 నియోజకవర్గాలు ఉండగా.. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు 152 సీట్లలో పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 29న మిగిలిన 142 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మే 4న విడుదలవుతాయి.
అధికారులపై ఈసీ తీవ్ర ఆగ్రహం..
బెంగాల్ (West Bengal) లోని పింగ్లా పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ బూత్ సిబ్బంది పోలింగ్ వేళ.. బయటకు వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులైన అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై విచారణ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.
బెంగాల్ లో రణరంగం..
అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. దక్షిణ దినాజ్‌పుర్ బీజేపీ అభ్యర్థిపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారు. ముర్షిదాబాద్‌లో టీఎంసీ, ఏయూజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. పలువురు టీఎంసీ కార్యకర్తలు ఏయూజేపీకి చెందిన కార్యకర్త కారును ధ్వంసం చేశారు. పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. లాఠీఛార్జి చేసి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. తమిళనాడు రాష్ట్రంలో మాత్రం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా ఎలాంటి ఘర్షణలు, అల్లర్లు చోటు చేసుకోలేదు.
Read Also: వెనక్కి తగ్గిన ట్రంప్.. భారత్ గొప్పదేశమంటూ కితాబు
Follow Us On : WhatsApp

