కలం, వెబ్ డెస్క్: భారత్ మీద తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్ (Trump) అంతలోనే వెనక్కి తగ్గారు. భారత్ గొప్పదేశమంటూ కీర్తించారు. భారత్‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వెనక్కి తగ్గినట్టు సమాచారం.
ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏమిటి?
‘బర్త్ రైట్ సిటిజన్‌షిప్’పై ట్రంప్ (Trump) పెట్టిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. అమెరికాలో పుట్టుకతో పౌరసత్వం కల్పించే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ట్రంప్, తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ప్రముఖ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ చేసిన వ్యాఖ్యలను రీపోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో ఇండియా, చైనాను నరకకూపాలుగా అభివర్ణించారు. ‘గర్భం దాల్చిన మహిళలు ప్రసవానికి కొద్ది రోజుల ముందు విమానాల్లో అమెరికా వస్తున్నారు. ఇక్కడ బిడ్డకు జన్మనివ్వడం ద్వారా పౌరసత్వాన్ని పొందుతున్నారు. ఆ తర్వాత ఆ బిడ్డ ద్వారా కుటుంబం మొత్తాన్ని చైనా, ఇండియా లేదా ప్రపంచంలోని మరేదైనా నరకకూపం నుంచి అమెరికాకు రప్పిస్తున్నారు’’అని మైఖేల్ సావేజ్ పేర్కొన్నారు. ఈ పోస్ట్ ను ట్రంప్ సమర్థించారు. దీంతో ట్రంప్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. అనంతరం భారత్‌ను పొగుడుతూ ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.

