జబ్బుల గుప్పిట్లో భారత్.. సగం మందికి అనారోగ్య సమస్యలు

కలం, నేషనల్ డెస్క్ : ఒకప్పుడు అంటువ్యాధులతో పోరాడిన భారత్, ఇప్పుడు జీవనశైలి మార్పులతో వచ్చే దీర్ఘకాలిక జబ్బుల గుప్పిట్లో చిక్కుకుంది. దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడమే దీనికి కారణం. మెజారిటీ భారతీయులు బీపీ, షుగర్, గుండె జబ్బుల బారిన పడుతున్నారని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్వో), అపోలో హాస్పిటల్స్ నివేదికలు (India Health Report) స్పష్టం చేస్తున్నాయి. గడిచిన పదేండ్లలో భారతీయుల హెల్త్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు జ్వరం, అతిసారం వంటి అంటువ్యాధులతో ఇబ్బంది పడిన జనం.. ఇప్పుడు గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యల బారినపడుతున్నారు. దేశ జనాభాలో దాదాపు సగం మంది (50%) మెటబాలిక్ వ్యాధులతో సతమతమవుతున్నారని తాజా సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ప్రతీ ఇద్దరిలో ఒకరు గుండె జబ్బు, బీపీ, షుగర్ లేదంటే థైరాయిడ్తో బాధపడుతున్నట్లు తేలింది.

పదేళ్లలో భారీ మార్పు..

గడిచిన దశాబ్ద కాలంలో జీవనశైలి వ్యాధుల వ్యాప్తి అనూహ్యంగా పెరిగింది. పదేండ్ల కింద దేశంలో ఈ తరహా వ్యాధుల బారిన పడిన వారు 31 శాతం ఉండగా.. 2025 నాటికి అది దాదాపు 50 శాతానికి చేరుకుంది. ఎన్‌ఎస్‌వో నివేదిక ప్రకారం.. 2017-18 కాలంలో గుండె సంబంధిత వ్యాధులు 16.7 శాతంగా ఉండగా.. ప్రస్తుతం అవి 25.6 శాతానికి పెరిగాయి. 2017, జులై నుంచి 2018 జూన్ మధ్య ఇది 16.70 శాతంగా ఉండేది. అలాగే షుగర్, థైరాయిడ్ వంటి మెటబాలిక్ వ్యాధులు 15 శాతం నుంచి 24.2 శాతానికి చేరాయి. జ్వరం, కామెర్లు వంటి అంటువ్యాధుల బారిన పడే వారి శాతం 32% నుంచి 15%కి తగ్గడం ఒక సానుకూల అంశం. అయితే, చిన్న పిల్లల్లో (14 ఏండ్లలోపు) ఇప్పటికీ సగానికి పైగా రోగాలు.. అంటువ్యాధుల కారణంగా వస్తున్నాయి. బీపీ, షుగర్, గుండెకు సంబంధించిన జబ్బులు.. 45 ఏండ్లుపైబడిన వారిలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. శారీరక శ్రమ తగ్గడం, ఆహారపు అలవాట్లలో మార్పులు, పెరిగిన మానసిక ఒత్తిడి వంటి కారణాలే ఈ పరిస్థితికి దారి తీస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని మిడిల్ ఏజ్ వాళ్లు ఈ వ్యాధుల బారినపడుతున్నారు.

భారీగా పెరిగిన హాస్పిటల్ ఖర్చులు

2025లో, సర్వేకు ముందు 15 రోజుల్లో తాము అనారోగ్యానికి గురైనట్లు 13 శాతం మంది తెలిపారు. ఇది 2017-18 నాటి గత సర్వేలో ఉన్న 7.5 శాతం నుంచి 13 శాతానికి పెరిగింది. దాదాపు 1.4 లక్షల కుటుంబాలను కవర్ చేసిన ఈ దేశవ్యాప్త సర్వే గణాంకాల ప్రకారం.. 15 రోజుల్లో అనారోగ్యం బారినపడ్డ భారతీయుల వాటా దాదాపు రెట్టింపు అయ్యింది. ఆస్పత్రిలో చేరిన సందర్భంగా ఖర్చు 70 శాతం పెరిగింది. ఇది దేశంలోని లక్షలాది మంది ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని తెలియజేస్తున్నది.

పురుషుల కంటే మహిళలే ఎక్కువ..

పురుషుల కంటే మహిళలే ఎక్కువ అనారోగ్యానికి గురవుతున్నట్లు సర్వేలో (India Health Report) తేలింది. గత అన్ని సర్వేల్లో ఇది ఇలాగే కొనసాగుతున్నది. వయస్సు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. 60 ఏండ్లు.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో 43.90 శాతం మంది సర్వేకు 15 రోజుల ముందు అనారోగ్యం బారినపడ్డారు. 2017–18 సర్వేలో 27.7 శాతంగా ఉంది. 45 నుంచి 59 ఏండ్ల వయస్సున్న గ్రూప్ వారిలో 22.5 శాతం మంది అనారోగ్యం బారినపడ్డారు. 2017–18లో ఇది 11.4 శాతంగా ఉంది.

పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఎఫెక్ట్

ఆస్పత్రిలో చేరే వారి రేటు గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చులు పేద కుటుంబాలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. హాస్పిటల్లో చేరినప్పుడు 2017–18లో సగటున రూ.20,135 ఉంటే.. ప్రస్తుతం రూ.34,064కు చేరుకున్నది. గత పదేండ్లలో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పెరిగిందని సర్వేలో తేలింది. గ్రామీణ జనాభాలో 47 శాతం, పట్టణ ప్రాంతాల్లో 44 శాతం మంది హెల్త్ ఇన్సూరెన్స్ కింద వస్తున్నారు. ఇది 2017–18లో గ్రామీణ జనాభాలో 14 శాతం, అర్బన్లో 19 శాతంగా ఉంది.

Read Also: వెనక్కి తగ్గిన ట్రంప్.. భారత్ గొప్పదేశమంటూ కితాబు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>