కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో విద్యా రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఏఐఎస్ఎఫ్ (AISF )ఆధ్వర్యంలో చేపట్టిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం విజయవంతమైంది. వేలాదిమంది విద్యార్థులు పాల్గొన్న ఈ ఆందోళనలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతూ.. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ విద్యా వ్యవస్థను నాశనం చేస్తే ప్రభుత్వానికి పతనం తప్పదని తీవ్రంగా హెచ్చరించారు.
వెంటనే పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయడంతో పాటు, విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో పేదలకు 25 శాతం ఉచిత సీట్లు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి మౌలిక వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పవన్ సాయి, సుజన్, వినయ్, వంశీ, నాగేంద్రబాబు, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

