కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో నెలకొన్న పొలిటికల్ హైడ్రామా.. క్లైమాక్స్‌కు చేరుకున్నట్లే కనిపిస్తున్నా.. మళ్లీ ఊహించని మలుపులు తిరుగుతున్నది. డీఎంకే, అన్నాడీఎంకేలకు షాక్ ఇచ్చి.. తొలి ప్రయత్నంలోనే 108 సీట్లు సాధించిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతును నిరూపించుకోవడంలో విజయ్ ఎదుర్కొంటున్న సవాళ్లు తమిళ రాజకీయాల్లో హైడ్రామాను తలపిస్తున్నాయి. ఒక్క ఎమ్మెల్యే మద్దతుపై క్లారిటీ లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది.
విజయ్ తన 2 సీట్లలో ఒకదానికి రాజీనామా చేయాల్సి రావడంతో, టీవీకే గెలిచిన మొత్తం 108 సీట్లలో ఒకటి తగ్గి, ఆ పార్టీ ప్రస్తుత బలం 107కు చేరుకుంది. కాంగ్రెస్ నుంచి ఐదుగురు, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో మొత్తం మెజార్టీ 116కు చేరింది. విజయ్ కి మద్దతు ఇవ్వడంపై శనివారం ఉదయం నిర్ణయాన్ని ప్రకటిస్తానని వీసీకే స్పష్టం చేసింది. మరోవైపు ఐయూఎంఎల్ మాత్రం డీఎంకేతోనే కొనసాగుతామని, టీవీకేకు మద్దతు ఇవ్వబోమని ప్రకటించింది. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకమాండ్ ఆదేశాలతో హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత వీరిలో నలుగురు బెంగళూరుకు, మరొకరు పుదుచ్చేరి వెళ్లిపోయారు.
సంఖ్యాబలంపై అనిశ్చితి..
రాజ్‌భవన్ వర్గాల సమాచారం ప్రకారం.. సీఎంగా ప్రమాణం చేసేందుకు విజయ్‌కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నుంచి ఇంకా అధికారిక ఆహ్వానం అందలేదు. శుక్రవారం సాయంత్రం విజయ్ గవర్నర్‌ను కలిసి 117 మంది (విజయ్ గెలిచిన రెండు స్థానాలు కలిపి) ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని, ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుందని టీవీకే వర్గాలు భావించినప్పటికీ.. సంఖ్యాబలంపై గవర్నర్ సంతృప్తి చెందకపోవడంతో అనిశ్చితి కొనసాగుతున్నది.
మ్యాజిక్ ఫిగర్‌కు ఇద్దరు దూరం..
గవర్నర్‌కు విజయ్ అందజేసిన జాబితాలో 117 మంది సభ్యుల మద్దతు మాత్రమే స్పష్టంగా ఉందని, మ్యాజిక్ ఫిగర్ 118కి ఇంకా ఒక ఎమ్మెల్యే తక్కువగా ఉన్నారని లోక్‌భవన్ పేర్కొన్నది. గవర్నర్‌కు ఐఎంయూఎల్ ఇచ్చిన లేఖలో విజయ్ లేదా టీవీకే పేర్లు ప్రస్తావించలేదు. ఐఎంయూఎల్ టీవీకే కూటమిలో చేరడానికి నిరాకరించడం విజయ్‌కు గట్టి ఎదురుదెబ్బ.
కాంగ్రెస్‌కు 2 మంత్రి పదవులు!
మరోవైపు, డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్.. తన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతును విజయ్‌కు ప్రకటించింది. అందుకు ప్రతిఫలంగా కేబినెట్‌లో 2 మంత్రి పదవులను ఆశిస్తున్నది. వీసీకే పార్టీ తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నిక సీటుతో పాటు ఒక మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తున్నది.
మంత్రివర్గంలో చేరం: లెఫ్ట్
టీవీకేకు బయట నుంచే తాము మద్దతిస్తామని.. ప్రభుత్వంలో చేరబోమని సీపీఎం నేత వాసుకి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీలు శుక్రవారం సమావేశమయ్యాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు బయటి నుంచే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. అసెంబ్లీలో బల పరీక్ష సమయంలో టీవీకేకు మద్దతుగానే కచ్చితంగా ఓటు వేస్తాం. కానీ, మంత్రివర్గంలో మాత్రం చేరం. ఇది కేవలం బయటి నుంచి మద్దతే. వామపక్షాలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని వీసీకే సైతం చెప్పింది. అందువల్ల వారు కూడా అదే తరహాలో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం. ప్రజలు టీవీకేకు అధిక మెజార్టీ ఇచ్చారు.. వారి విశ్వాసం మేరకు ప్రభుత్వ ఏర్పాటు కోసమే మేం మద్దతు తెలుపుతున్నాం. ప్రజా సమస్యల ఆధారంగానే మేం స్వతంత్రంగా వ్యవహరించి పనిచేస్తాం. లౌకికవాదం, ప్రజల ఐక్యత, రాష్ట్రాల హక్కులు.. ఇలా ఇతర ఏ అంశమైనా సరే ప్రస్తావనకు వచ్చినప్పుడు మాతో కలిసొచ్చే ఏ లౌకిక పార్టీతోనైనా కలిసి నడుస్తాం’’ అని వాసుకి తెలిపారు.
మా ప్రమేయం లేదు: బీజేపీ
డీఎంకే-అన్నాడీఎంకేలు చేతులు కలుపుతాయన్న ప్రచారం జరిగినప్పటికీ.. పరస్పర విరుద్ధ ప్రయోజనాల దృష్ట్యా సాధ్యం కాలేదు. ఇక లోక్ భవన్ నిర్ణయం వెనుక బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలను ఆ పార్టీ కొట్టిపారేసింది. కేవలం రాజ్యాంగబద్ధంగా మెజార్టీ నిరూపించుకోవాలని గవర్నర్ కోరుతున్నారని బీజేపీ స్పష్టం చేసింది. 118 కంటే ఒక్కరు తక్కువ ఉన్నా ప్రమాణ స్వీకారానికి అనుమతించేది లేదని గవర్నర్ కఠినంగా వ్యవహరిస్తుండటంతో తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ పీక్స్‌కు చేరింది. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం.. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ మీద ఆధారపడి ఉంది. ఒకవేళ సంఖ్యాబలంపై గవర్నర్ సంతృప్తి చెందితే.. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపడతారు.
వామపక్షాలకు విజయ్ థ్యాంక్స్..
వామపక్షాలు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో నెలకొన్న అనిశ్చితి తొలగింది. దీంతో గవర్నర్‌తో సమావేశం ముగిసిన వెంటనే విజయ్ నేరుగా చెన్నైలోని సీపీఐ, సీపీఎం కార్యాలయాలకు వెళ్లారు. తనకు మద్దతు ప్రకటించిన కమ్యూనిస్టు పార్టీల నేతలకు కృతజ్ఞతలు చెప్పారు. కాగా, శనివారం ఉదయం 11గంటలకు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేస్తారని సీపీఎం నేత కె.బాలకృష్ణన్ వెల్లడించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. తాజా పరిణామంతో ప్రమాణస్వీకారం ఎప్పుడనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

