కలం, వెబ్ డెస్క్: ధరణి పోర్టల్ (Dharani Portal)లో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. సీఐడీ డీజీ చారు సిన్హా నేతృతంలో 15 ప్రత్యేక బృందాల అధికారులు గత రెండు రోజులుగా రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, భువనగిరి, జనగామ, సిద్దిపేట, మేడ్చల్ జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ధరణి పోర్టల్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన 9 మంది ఆపరేటర్లను అరెస్ట్ చేశారు. వీరు అక్రమంగా లాగిన్ అయి భూముల రికార్డులు మార్చినట్లుగా అనుమానిస్తున్నారు. కోర్టు కేసులు, భూదాన్ భూములు బై నెంబర్లు సృష్టించి భూ హక్కులు మార్చేసినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో వెలుగు చూసింది. ఇబ్రహీంపట్నం మంచాలలో డాక్యుమెంట్ రైటర్ కిరణ్ దగ్గర కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కందుకూరులో డాక్యుమెంట్ రైటర్ శివను అదుపులోకి తీసుకున్నారు.
రెండు సంస్థలపై ప్రత్యేకంగా..
2018లో అప్పటి ప్రభుత్వం ధరణి ప్రాజెక్టు డిజిటలైజేషన్ కోసం IL&FS టెక్నాలజీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ (Dharani Portal) ప్రారంభమైంది. టెర్రాసిస్ టెక్నాలజిస్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా కీలక పాత్ర పోషించింది. భూముల రికార్డుల డిజిటలైజేషన్, నిర్వహణ, సాంకేతిక సేవల్లో ఈ సంస్థలే ప్రధానం. ఈ నేపథ్యంలో టెండర్ల కేటాయింపు, ఒప్పందాలు, కంపెనీల మధ్య జరిగిన లావాదేవీలు, భూముల రికార్డుల్లో మార్పులు, డేటా యాక్సెస్ వివరాలపై సీఐడీ ఆరా తీస్తోంది. పోర్టల్‌లో అక్రమాలకు పాల్పడింది ఎవరు..? వాటి వెనుక ఎవరున్నారు..? అనేది తనిఖీ చేస్తోంది. ఈ సందర్భంగా లభిస్తున్న డిజిటల్ డాక్యుమెంట్లు కీలక ఆధారాలుగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
Also Read : దీపావళి బోనస్‌గా కళ్లు చెదిరే కానుక!
Follow Us On: X(Twitter)

