కలం, తెలంగాణ బ్యూరో : ప్రధాని మోడీ ఈ నెల 10న హైదరాబాద్‌లో నిర్వహించే సభ (PM Modi Hyderabad Visit), తెలంగాణలోని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టే కార్యక్రమం రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఒక ‘టర్నింగ్ పాయింట్’గా నిలుస్తుందని కమలనాధులు భావిస్తున్నారు. మోడీ ఇమేజ్‌ను రాష్ట్రంలో రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నది. ‘మోడీ ఇన్ హైదరాబాద్’ అనే ట్యాగ్‌తో సోషల్ మీడియాలో బీజేపీ విస్తృత ప్రచారం చేస్తున్నది. తెలంగాణలో తదుపరి అధికారం బీజేపీదే అంటూ కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు పదేపదే కామెంట్ చేస్తున్నారు. మోడీ గర్జన తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఊతమిస్తుందని భావిస్తున్నారు. ప్రధాని మోడీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నా పెరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభ మాత్రం రాష్ట్రంలో పొలిటికల్‌గా ఒక టర్నింగ్ పాయింట్‌గా మారుతుందన్నది రాష్ట్ర బీజేపీ నేతల భావన. అందుకే అన్ని నియోజకవర్గాలు, జిల్లాల నుంచి కార్యకర్తలను ఈ సభకు తరలిస్తున్నారు.
రాజకీయ విమర్శలకు కేంద్రంగా ప్రధాని టూర్ :
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన, హైదరాబాద్ బహిరంగసభ రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌కు దారితీయనున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పరం విమర్శలు మొదలయ్యాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నెండేండ్ల కాలంలో ఇచ్చిన లెక్కలను వివరించడానికి సిద్ధమంటూ కాంగ్రెస్ నేతలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాలు విసురుతున్నారు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలున్నా, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని, తెలంగాణ మీద బీజేపీకి మొదటి నుంచీ వివక్షేనని సీఎం, మంత్రులు సహా కాంగ్రెస్ నేతలు పలుమార్లు విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పాటును అవమానించడం మొదలు సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం, రాష్ట్రం తలపెట్టిన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకపోవడం, నిధులను అందించకపోవడం.. వీటన్నింటినీ కాంగ్రెస్ నేతల ప్రస్తావిస్తున్నారు. ప్రధాని మోడీ చేసే ప్రసంగంలోని అంశాలపై సమయానుకూలంగా స్పందించడానికి హస్తం నేతలు రెడీ అవుతున్నారు.
జనసమీకరణతోనే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం :
ప్రధాని మోడీ బహిరంగసభను రాజకీయంగా వాడుకోవాలని భావిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు భారీ స్థాయిలో జన సమీకరణ చేస్తున్నది. ప్రధాని స్పీచ్‌ను స్వయంగా శ్రేణులు వినడం ద్వారా ఉత్తేజం పొందుతారనే భావనతో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ప్రజలను, అభిమానులను, కార్యకర్తలను తరలించే బాధ్యతను ఎమ్మెల్యేలు, ఎంపీలకు అప్పజెప్పింది. “ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక సునామీని సృష్టిస్తుంది.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. మోడీ పాలనపై ఉన్న నమ్మకమే ఈ సభకు వచ్చే అశేష జనవాహిని.. హైదరాబాద్ గడ్డపై కమలం వికసించబోతోంది..” అంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. “కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలకు చెక్ పెట్టే సమయం వచ్చింది.. హైదరాబాద్‌లో మే 10న జరిగేది సభ మాత్రమే కాదు.. అవినీతి పార్టీల అంతానికి నాంది.. మోడీ స్పీచ్‌తో ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం..” అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. “హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది.. పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు..” అని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు అన్నారు.

