కలం, వెబ్‌డెస్క్: దీపావళి పండుగ వేళ తన ఉద్యోగులకు ఊహించని బహుమతి అందించి ఓ వస్త్ర వ్యాపారి వార్తల్లో నిలిచారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వస్త్ర వ్యాపారి రామ్‌స్వరూప్ ముండే తన వద్ద పని చేస్తున్న 20 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా నగదు దీపావళి బోనస్ (Diwali Bonus)గా అందజేశారు. సాధారణంగా పండుగల సమయంలో స్వీట్లు, బహుమతులు ఇస్తుంటారు. కానీ, ఆయన మాత్రం భారీ మొత్తంలో నగదును అందించి ఉద్యోగులను ఆశ్చర్యపరిచారు. రూ.10, 20, 50, 100, 200, 500 నోట్లను వెండి రంగు ప్లేట్లో అందంగా అమర్చి ఒక్కొక్కరికీ బహుమతిగా ఇచ్చారు. ఈ కానుకలు చూసిన ఉద్యోగులు ఇది కలా, నిజమా అని షాకయ్యారు. ఓ మహిళా ఉద్యోగి అయితే ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ నగదు పంపిణీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తన చిన్నతనంలో పేదరికాన్ని అనుభవించానని, పండుగల సమయంలో కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు తనకు తెలుసని ముండే తెలిపారు. తన వద్ద పని చేసే ఉద్యోగులను కేవలం సిబ్బందిగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావిస్తానని చెప్పారు. ఏడాది పొడవునా వారు చూపించే కష్టం, అంకితభావమే వ్యాపార అభివృద్ధికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. దీపావళి పండుగను ఉద్యోగులు తమ కుటుంబాలతో సంతోషంగా జరుపుకోవాలని, ఇంటి అవసరాలు, పండుగ కొనుగోళ్లకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి లక్ష రూపాయలకు పైగా బోనస్ (Diwali Bonus) ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు కంపెనీ యజమానికి అభినందిస్తున్నారు.
Also Read : ప్రధాని మోదీకి ఆయనే ముఖ్యం: అభిజిత్ దీప్కే
Follow Us On: Youtube

