కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు (Tamil Nadu) లో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ (BJP Chief Nainar Nagendran) సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన తొలిసారిగా స్పందించారు. ఎన్నికల ఫలితాలను తమ పార్టీ మనస్ఫూర్తిగా స్వీకరిస్తుందన్నారు. అంతేకాకుండా, తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి ఎలాంటి అవకాశం గానీ, అధికారం గానీ ప్రజలు ఇవ్వలేదని భావిస్తున్నామన్నారు.
తమిళ ప్రజల తీర్పును, ఫలితాలను గౌరవిస్తున్నట్లు నైనార్ నాగేంద్రన్ తెలిపారు. తమిళనాడు (Tamil Nadu) లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నంలో రాష్ట్ర బీజేపీ ఎలాంటి సంబంధం కలిగి ఉండదల్చుకోలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ప్రభుత్వ ఏర్పాటులో ప్రత్యక్షంగా పాల్గొనదల్చుకోలేదని స్పష్టం చేశారు. అదే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగస్వామ్యం అయ్యే ఏ పార్టీకి కూడా తాము ఓటు వేయబోమని బీజేపీ నైనార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు.

