కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు వేస్తోంది. దీంతో ఈ ఎన్నికల్లో బీజేపీ తమ 27 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. 27మందితో విడుదల చేసిన ఈ జాబితాలో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై మైలాపూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సత్తూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై పేరు జాబితాలో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తమిళనాడులో బీజేపీకి కీలక నాయకుడైన కె. అన్నామలై.. ఈసారి బీజేపీ ప్రచారానికి ముఖచిత్రంగా ఉంటారని భావించినా.. ఆయనకు ప్రస్తుతం విడుదల చేసిన తొలి విడత జాబితాలో చోటు దక్కలేదు. కోయంబత్తూరు ఉత్తర నియోజకవర్గం విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనే ఇందుకు కారణం అని సమాచారం అందుతోంది. కోయంబత్తూరు ఉత్తర నియోజకవర్గానికి అన్నామలై బీజేపీ అభ్యర్థిగా ఉంటారని భావించినా..పార్టీ ఆ స్థానానికి పార్టీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్‌ను తిరిగి నిలబెట్టడం పార్టీలోని అంతర్గత కలహాలకు సంకేతంగా నిలుస్తోంది. సీట్ల పంపకంపై అసంతృప్తితోనే అన్నామలై ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నట్లు తమిళనాడు పాలిటిక్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతుతోంది.
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి 2026, ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. 2026, మే 4న కౌంటింగ్, ఫలితాలు విడుదల కానున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)తో కలిసి పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా అన్నాడీఎంకే 169 సీట్లలో పోటీ చేయనుండగా.. బీజేపీకి 27 స్థానాలు దక్కాయి. అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)కి 18 సీట్లు కేటాయించగా, టీటీవీ దినకరన్‌కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) 11 స్థానాల్లో పోటీ చేయనుంది.

