Mobile Popup Ad
Mobile Popup Ad

కేసీఆర్‌కు పోటీగా సభ పెట్టడం సిగ్గు చేటు: తలసాని

కలం, కరీంనగర్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR) జగిత్యాల ఆత్మగౌరవ సభకు రానుండటంతో కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం తలసాని మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ బయటకు రాడు అని విమర్శలు చేసే కాంగ్రెస్ నాయకులకు.. కేసీఆర్‌ జగిత్యాల సభతో బయటికి వస్తున్నా అనగానే భయం పుట్టి… రేపు ఎల్లుండో రైతుబంధు వేస్తానని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. గతంలో బయటకు వస్తే కృష్ణా జలాలు విడుదల చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ పరిపాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని, ఆయన హయాంలో జిల్లాలకు మెడికల్ కాలేజీలు, కలెక్టరేట్లు, గురుకులాలు నిర్మించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టే విధానం తప్ప.. ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యం అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ దళిత బంధు, వృద్ధులకు పెన్షన్, రైతు బీమా, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. ఈ పథకాల కంటే రెట్టింపు ఇస్తామ‌ని కాంగ్రెస్ నేత‌లు ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలను ఇచ్చి గద్దెనెక్కి నాటి కేసీఆర్ పథకాలన్నీ బంద్ చేశార‌ని విమర్శించారు. కేసీఆర్‌ కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టు, కొండపోచమ్మ సాగర్ వంటి ప్రాజెక్టులతో రైతులకు నీరు అందించారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే ఏ ఒక్క ప్రాజెక్టు కట్టకుండానే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండున్నర ఏళ్ల కాలంలో.. మూడున్నర లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. కరీంనగర్‌లో డంప్‌యార్డ్ సమస్యను కూడా పరిష్కరించలేకపోయార‌ని విమర్శించారు. కాళేశ్వరంపై గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నేత‌లు ఎందుకు ఆ ప్రాజెక్ట్ సంద‌ర్శ‌న‌కు వెళ్తున్నార‌ని ప్ర‌శ్నించారు. కేసీఆర్‌కు పోటీగా సభ పెట్టడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

రాష్ట్ర ప్ర‌జ‌లంతా ప్రజలంతా బీఆర్ఎస్, కేసీఆర్ వెంటే ఉన్నారని, సోమవారం జగిత్యాలలో జరిగే జైత్రయాత్ర సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు, కంటోన్మెంట్ బోర్డు చైర్మన్ గజ్జెల నగేష్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా గ్రంథాల‌య సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, గందె మహేశ్ మైనార్టీ నాయకులు మీర్ సౌఖత్ ఆలీ, నారదాసు వసంతరావు, గూడెల్లి రాజ్ కుమార్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>