కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల హక్కులను హరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత (Kavitha) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల హక్కులను పరిరక్షించేందుకు ఆల్ ఇండియా ఆదివాసీ కానిస్ట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ చేస్తున్న పోరాటానికి తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ప్రకటించారు.హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవితతో ఆల్ ఇండియా ఆదివాసీ కానిస్ట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ ఆల్ ఇండియా చైర్మన్, ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య భేటీ అయ్యారు. కేంద్రం నిరంకుశ విధానాలతో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను జాగృతి అధ్యక్షురాలికి ఆయన వివరించారు. జనగణనలో ఆదివాసీల మతం చెప్పుకునేందుకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తామని, ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం పాటు పడుతామని కవిత హామీ ఇచ్చారు.
పెసా చట్టానికి తూట్లు పొడుస్తోన్న కేంద్రం..
కేంద్రం పెసా చట్టానికి తూట్లు పొడుస్తోందని.. రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్లలోని రక్షణలను తొలగిస్తోందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో 3 లక్షల మంది ఆదివాసీలను అడవి నుంచి దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి వారికి అడవిలో అన్ని సౌకర్యాలతో కూడిన పునరావాసం కల్పించడం లేదని అన్నారు. జనగణనలో మతం కేటగిరిలో ఆదివాసీ అనే కాలమ్ పెట్టలేదని.. ఇది దేశ మూలవాసులైన ఆదివాసీల సంస్కృతిని అవమానించడమేనని అన్నారు. జనగణనలో తమది ఆదివాసీ మతం అని చెప్పుకునేలా ప్రత్యేక కాలమ్ పెట్టాలని.. ఆదివాసీల భాష ‘‘కోయతూర్’’ ను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ చేర్చాలన్నారు. దేశంలోని 12 కోట్ల మంది ఆదివాసీలు నిజమైన భారత దేశ సంస్కృతికి ప్రతినిధులు అని.. వారి గౌరవాన్ని కాపాడేలా తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ ఉంటుందన్నారు.
తెలంగాణ జాగృతి కార్యాలయంలో చందా లింగయ్యతో పాటు ఆదివాసీ జేఏసీ ముఖ్య నాయకులు పాడూరి శ్రీనివాస్, పాయం సత్యనారాయణ, మాడవి నర్సింగరావు, వట్టం నారాయణ దొర, రమణాల లక్ష్మయ్య, వజ్జ నర్సింహరావు, కబ్బాక శ్రావణ్ కుమార్, కుర్సంగ వేణు, వరియ శ్రీనివాస్, షడమాకి సంజీవ్, ఆత్రం పైకాజీ, పోదెం భార్గవ తదితరులు కవితను మర్యాదపూర్వకంగా కలిశారు.

