కలం, నిజామాబాద్ బ్యూరో: అంతర్రాష్ట్ర కిడ్నాప్ ముఠా పన్నిన ఓ భారీ కుట్రను కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీసులు (Tadwai Police) భగ్నం చేశారు. అక్రమ తుపాకీతో ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేసిన ఆరుగురిని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు కామారెడ్డి (Kamareddy) జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర వెల్లడించారు. మే 27న తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాజీవాడి శివాలయం వద్ద కొందరు అనుమానితులు నేరానికి పథకం వేస్తున్నారనే సమాచారంతో ఎస్ఐ నరేష్ సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు.
కామారెడ్డికి చెందిన వ్యాపారవేత్త భూస శ్రీనివాస్‌తో నిందితులైన నిట్టు నర్సింగా రావు, వడ్డే స్వామి, పులి ప్రశాంత్ గౌడ్, సూరం స్వామిలకు పరిచయం ఉంది. వీరి మధ్య గతంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి. శ్రీనివాస్ వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉందని, పాత బాకీలు ఎగ్గొట్టేందుకు అతన్ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు.. అందుకు మహారాష్ట్రలోని అజయ్ హన్మంత రావ్ గోంగపాలే, వైభవ్ ప్రకాశ్ బరాడేవర్ సహకారంతో నయా గావ్‌కు చెందిన మారుతి ఘోకే వద్ద నుంచి రూ.30,000కు తుపాకీ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ రూ.27,000 చెల్లించారు. మే 27న తుపాకీని నిందితులకు అప్పగించే సమయంలో పోలీసులు పట్టుకున్నారు. విచారణలో ధనికుడైన శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసి కుటుంబసభ్యుల నుంచి భారీగా డబ్బు వసూలు చేయాలని ప్లాన్ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు..
స్వాధీనం చేసుకున్నవి
నల్ల రంగు ఫైర్ ఆర్మ్, రబ్బర్ బుల్లెట్లు 5, ఎయిర్ రైఫిల్ పెల్లెట్ బాక్సులు 2, మొబైల్ ఫోన్లు 5, హీరో స్లెండర్ బైక్, మంకీ క్యాప్ లు 2, మాస్కులు 3, నైలాన్ తాడు, పసుపు టేప్, నల్ల గాగుల్స్, నగదు రూ.3,000 నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన నిందితులు
చిట్యాలకు చెందిన నిట్టు నర్సింగా రావు(55), సురం స్వామి(40), సంతాయిపేట్‌కు చెందిన సూర స్వామి అలియాస్ వడ్డె స్వామి(27), పులి ప్రశాంత్ గౌడ్(40), మహారాష్ట్రలోని నాయగావ్‌కు చెందిన వైభవ్ ప్రకాశ్ బరాడేవర్(21), కొకులేగావ్‌కు చెందిన అజయ్ హన్మంత రావ్ గోంగపాలే(25)లను పోలీసులు అరెస్ట్ చేశారు.
పాత నేరస్తులే
నిందితుల్లో నిట్టు నర్సింగా రావుపై గతంలో తాడ్వాయి పీఎస్‌లో హత్యాయత్నం కేసు ఉంది. మరో నిందితుడు మారుతి ఘోకే పరారీలో ఉన్నాడు. గాలించేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. తాడ్వాయి పీఎస్‌లో క్రైమ్ నెంబర్ 77/2026 కింద 25 61(2) 2, 3, 4, 25(1AA) యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. అంతర్రాష్ట్ర నేర ముఠాల పట్ల వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే డయల్ 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ రాజేష్ చంద్ర కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.
Read Also: వామ్మో ఎకరం రూ.237 కోట్లు.. రాయదుర్గంలో రికార్డు ధర
Follow Us On: Sharechat

