కలం, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం టీఎంసీ (TMC)పై ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతలు సైతం విమర్శలకు దిగుతున్నారు. తాజాగా టీఎంసీ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ లీడర్ రిజు దత్తా (Riju Dutta) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ ఐ ప్యాక్ (i PAC) చేతుల్లో బందీగా మారిందని రిజు దత్తా ఆరోపించారు. పార్టీ మొత్తం ప్రైవేట్ సంస్థ ఐ ప్యాక్ చేతుల్లోకి ఎలా వెళ్లిపోయిందో మమతా బెనర్జీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మమతా బెనర్జీతో పాటు అభిషేక్ బెనర్జీపై రిజు దత్తా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ నేతల ఇండ్లపై ఈడీ దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ డేటాను కాపాడుకోవడానికే మమతా బెనర్జీ ప్రాధాన్యత ఇచ్చారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్న ఈడీ కేసు గనుక మమతకు వ్యతిరేకంగా వస్తే ఆమె జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.
మరోవైపు ఐ ప్యాక్ డైరెక్టర్ చందేల్‌కు బెయిల్ లభించిన తీరుపైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. రెండో విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజే వినేష్ చందేల్‌కు కింది కోర్టు బెయిల్ మంజూరు చేయడం చూస్తుంటే ఆ కేసు అంతా ఒక డ్రామా అని అర్థం అవుతోందని విమర్శించారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం నశించిందని, ఐ ప్యాక్ వంటి సంస్థల కనుసన్నుల్లోనే నిర్ణయాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. టీఎంసీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రిజు దత్తా చేసిన ఆరోపణలు ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

