కలం, వెబ్ డెస్క్: కేరళ ముఖ్యమంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కేసీ వేణుగోపాల్ పేరు దాదాపు ఖరారైనట్టేనని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అగ్రనేత రాహుల్ గాంధీ మదిలో సైతం కేసీ వేణుగోపాల్ పేరే ఉన్నట్టు సమాచారం. అయితే కేసీ వేణుగోపాల్ పేరును ప్రకటిస్తే అసంతృప్తి గళాలు వినిపించే అవకాశం ఉంది. దీంతో అధిష్ఠానం ఆచీతూచీ స్పందిస్తోంది. ముందుగా కేరళకు సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నేతలను, అసంతృప్తులను ఒప్పించాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు సమాచారం.
ఖర్గేతో రాహుల్ భేటీ..
కేరళ ముఖ్యమంత్రి ఎంపికపై ఢిల్లీలో కీలక భేటీ జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. అంతకుముందు రాహుల్.. కేసీ వేణుగోపాల్‌తో ప్రత్యేకంగా సమావేశమైనట్టు సమాచారం. ఇదే సమయంలో వేణుగోపాల్‌ను వ్యతిరేకిస్తూ కేరళలో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్ల వెనుక మరో కీలక నేత వీడీ సతీశన్ అనుచరుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖర్గే నివాసంలో జరిగిన సమావేశానికి వీడీ సతీశన్ హాజరుకావడంతో ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ ఆయనను ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి స్పందించిన సతీశన్.. వేణుగోపాల్ ముఖ్యమంత్రి కావడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని కుంబద్ధలు కొట్టినట్టు సమాచారం. వేణుగోపాల్ కేరళలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని సతీశన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే తాను ప్రతిపక్ష నేతగా పనిచేసిన సమయంలో ఎప్పుడూ వర్గ రాజకీయాలకు తావివ్వలేదని, అందరినీ కలుపుకొని పనిచేశానని సతీశన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
రేసులో ముందంజలో కేసీ వేణుగోపాల్
ఇప్పటికే ముఖ్యమంత్రి రేసులో వేణుగోపాల్ ఇతరుల కంటే ముందంజలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జాతీయస్థాయిలో బలమైన నాయకుడైన వేణుగోపాల్‌ను ఎంపిక చేయాలా? లేక రాష్ట్రంలో బలమైన మద్దతు ఉన్న స్థానిక నేతను ఎన్నుకోవాలా? అన్న దానిపై కాంగ్రెస్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న మరో నేత సతీశన్‌కు రాష్ట్రంలో బలమైన మద్దతు ఉందని సమాచారం. ముఖ్యంగా సతీశన్‌కు కాంగ్రెస్ మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది.
పోస్టర్ వార్
ఈ పరిణామాల నేపథ్యంలో కేరళలో కాంగ్రెస్ శ్రేణుల మధ్య పోస్టర్ వార్, నిరసనలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరికి వారు తమ నేతలకు అనుకూలంగా పోస్టర్లు పెట్టుకుంటున్నారు. 140 సభ్యుల కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ 63 స్థానాలు గెలుచుకోగా, ఐయూఎంఎల్ 22 స్థానాలు సాధించింది. కేరళ కాంగ్రెస్ (కేఈసీ) 8 స్థానాలు, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్‌ఎస్‌పీ) 3 స్థానాలు గెలుచుకున్నాయి. మొత్తంగా యూడీఎఫ్ కూటమి 102 స్థానాలు సాధించి రెండు మూడొంతుల మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రతిపక్ష నేతగా వీడీ సతీశన్ కీలక పాత్ర పోషించారని కేరళ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

