కలం, కరీంనగర్ బ్యూరో : మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ (Sardar Ravinder Singh) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చి ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో తన డివిజన్‌లో పుట్టే ప్రతి ఆడబిడ్డకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు తాజాగా పైండ్ల రవళి – ప్రశాంత్ దంపతులకు జన్మించిన చిన్నారి కుటుంబానికి స్వయంగా వెళ్లి రూ.10 వేల నగదు సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా సర్ధార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ, ఆడబిడ్డ పుట్టిన ఇంట్లో ఆనందం రెట్టింపు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట తనకు బాధ్యత అని, పదవులు ఉన్నా లేకపోయినా ప్రజాసేవ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘ఆడబిడ్డ భారమేమీ కాదు.. కుటుంబానికి అదృష్టం’ అనే సందేశాన్ని సమాజానికి చాటిచెబుతున్న ఆయన చర్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నికల తర్వాత కూడా మా ఇంటికి వచ్చి మాట నిలబెట్టుకోవడం గొప్ప విషయం. ఇలాంటి నాయకులు సమాజానికి అవసరం అంటూ ఆనందం వ్యక్తం చేశారు. డివిజన్ ప్రజలు కూడా ఆయన సేవలను ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

