Delhi Blast | దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన వెనుక ఉగ్రమూలాల కుట్ర దాగి ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికీ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయకపోయినప్పటికీ ఇందుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ఈ ఘటన దేశవ్యాప్తంగా విస్తరించిన ఉగ్ర నెట్‌వర్క్ భాగమని తెలుస్తోంది. పేలుడులో ఉపయోగించిన కారును చివరిసారిగా జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన వైద్యుడు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ డాక్టర్‌కు హరియాణాలోని ఫరీదాబాద్ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నట్లు సమాచారం.
పుల్వామా వైద్యుడి లింకులు
పేలుడు ఘటనలో ఉపయోగించిన కారు పుల్వామా వైద్యుడు డాక్టర్ ఉమర్ మహమ్మద్(Umar Muhammad) పేరిట ఉన్నట్లు రిజిస్ట్రేషన్ వివరాలు వెల్లడించాయి. అతనికి ఫరీదాబాద్‌లో కార్యకలాపాలు జరుపుతున్న ఉగ్ర మాడ్యూల్‌తో ఆర్థిక, సమాచార సంబంధాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నిఘా సంస్థలు దేశవ్యాప్తంగా అనుమానాస్పద వ్యక్తుల కదలికలను మానిటరింగ్ చేస్తున్నాయి.
జమ్మూకశ్మీర్ నుంచి ఫరీదాబాద్ వరకూ
ఇటీవల జమ్మూకశ్మీర్‌లో పోలీసులు భారీ ఉగ్ర కుట్రను ఛేదించారు. అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్‌తో కూడిన 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసులో ఫరీదాబాద్ కేంద్రంగా పనిచేసిన డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ అదీల్(Dr Adil Ahmad)లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరితో డాక్టర్ ఉమర్ మహమ్మద్ తరచుగా సంప్రదింపులు జరిపినట్లు కాల్ రికార్డులు, ఆన్‌లైన్ చాట్ హిస్టరీలో బయటపడింది.
ఎర్రకోట పేలుడు దిశలో దర్యాప్తు
పేలుడు(Delhi Blast) సమయంలో ఎర్రకోట సమీపంలో కారు సీసీటీవీల్లో కనిపించినట్లు అధికారులు తెలిపారు. కారు మార్గం, పేలుడు స్థలం చుట్టూ లభించిన రసాయన అవశేషాలను పరీక్షించగా, వాటిలో అమ్మోనియం నైట్రేట్ సమ్మేళనం ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. జమ్మూకశ్మీర్‌లో స్వాధీనం చేసిన పేలుడు పదార్థాల రసాయన నిర్మాణం కూడా అదే తరహాలో ఉండటంతో, రెండు ఘటనలూ ఒకే ఉగ్ర మాడ్యూల్ కుతంత్రం కావచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
ఇంటెలిజెన్స్ అలర్ట్
ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ, హరియాణా, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో భద్రతా వ్యవస్థలు అత్యంత అప్రమత్తం అయ్యాయి. కేంద్ర హోం మంత్రిత్వశాఖ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీను దర్యాప్తు చేస్తోంది. దేశంలోని ఇతర నగరాల్లో కూడా అధిక జనసంచారం ఉన్న ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు పెంచాయి.
ఒకే నెట్‌వర్క్ కుట్ర
ఢిల్లీ ఎర్రకోట పేలుడు, జమ్మూకశ్మీర్ ఉగ్ర కుట్ర, హరియాణా ఫరీదాబాద్ మాడ్యూల్ ఈ మూడు ఘటనలు మధ్య సంబంధాలు ఉన్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. జైషే మహమ్మద్ , అన్సార్ ఘజ్‌వత్-ఉల్-హింద్ వంటి ఉగ్ర సంస్థలు వైద్యులు, టెక్నికల్ ప్రొఫెషనల్స్ ద్వారా నూతన మాడ్యూల్స్ నిర్మించే వ్యూహం అమలు చేస్తున్నాయి.
Read Also: హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సు దగ్దం..
Follow Us on : Pinterest

