చట్టాన్ని ఉల్లంఘిస్తే పీడీ యాక్ట్ తప్పదు: ఎస్పీ నరసింహ

కలం, సూర్యాపేట : గతంలో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని, సమాజ హితం కోసం, మంచి పనుల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూర్యాపేట (Suryapet) జిల్లా ఎస్పీ నరసింహ (SP Narasimha) పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సస్పెక్ట్ షీట్స్, హిస్టరీ షీట్స్, గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులకు డివిజన్ స్థాయి కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై, షీట్ హోల్డర్లకు దిశానిర్దేశం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ (SP Narasimha) మాట్లాడుతూ.. పాత నేరస్థుల ప్రస్తుత జీవన శైలి, వారు చేస్తున్న పనులపై పోలీసుల నిరంతర నిఘా ఉందని స్పష్టం చేశారు. ప్రతి నెలా ఇలాంటి కౌన్సిలింగ్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. సమాజంలో సత్ప్రవర్తన కలిగి, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటే.. ఎవరి ఫైరవీలు లేకుండానే చట్టప్రకారం పరిశీలించి వారిపై ఉన్న షీట్లను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. అలవాటుగా నేరాలకు పాల్పడుతూ, ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ నమోదు చేయడమే కాకుండా, పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపుతామని హెచ్చరించారు.

ప్రస్తుతం పోలీసు దర్యాప్తులో వేగం, నాణ్యత పెరిగాయని, పక్కా ఆధారాలతో నిందితులను కోర్టుల ముందు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఇటీవలే గరిడేపల్లి, మెళ్లచెరువు, మునగాల, మోతే పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన హత్య కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్షలు పడటాన్ని ఆయన గుర్తుచేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భౌతిక దాడులకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సబ్ ఇన్స్పెక్టర్లు ఏడుకొండలు, సాయిరాం, శివతేజ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>