ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. స్పీకర్(Telangana Speaker) గడ్డం ప్రసాద్‌కుమార్‌పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై గడువు ముగిసినా ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్‌లను అక్టోబర్ 31లోపు పరిష్కరించాలంటూ గత జూలై 31న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఆ గడువు ముగిసినా ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మరోసారి పిటిషన్ దాఖలైంది. స్పీకర్ తీర్పును ఆలస్యం చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అంటూ సదరు పిటిషనర్ ఆరోపించారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లుగా భావిస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్(Contempt Plea) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు అంగీకరించింది. ఈ కేసును వచ్చే సోమవారం విచారణకు తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈ పిటిషన్ న సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడం ఆసక్తికరంగా మారింది. కోర్టు మరోసారి ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నది అన్నది వేచి చూడాలి. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలను స్పీకర్(Telangana Speaker) విచారణకు పిలిచారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలోనే కొంత గందరగోళం ఉంది. దానం నాగేందర్ నేరుగా కాంగ్రెస్ టికెట్ ద్వారా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. కడియం శ్రీహరి తన కూతురికి టికెట్ ఇప్పించుకొని ప్రచారంలో పాల్గొన్నారు. వీరు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. దీంతో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Read Also: వాళ్లంతా మూర్ఖులు..: ట్రంప్
Follow Us on : Pinterest

