కలం, వెబ్ డెస్క్ : ప్రేమ చట్టాలకు లోబడి ఉండాలి. కానీ ఆ ప్రేమ వల్లే శిక్షలు తప్పవంటే ఏం చేయాలి. చట్టం చెప్పినే వయసు రాకపోతే ప్రేమించుకోకూడదా? ప్రేమించుకుంటే నేరమా? ఇలా అనేక ప్రశ్నలు ఇటీవల కాలంలో జోరుగా వినిపిస్తున్నాయి. పోక్సో చట్టం కింద నమోదవుతున్న కేసుల అంశంలో ఇవి ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ప్రశ్నలు, ఈ పరిస్థితిపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. పోక్సో చట్టంలోకి రోమియో-జూలియట్ క్లాజ్ (Romeo Juliet Clause) తీసుకురావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
మైనర్‌ల మధ్య నిజమైన ప్రేమ సంబంధాలు నేరాలుగా మారుతున్న పరిస్థితులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం పోక్సోను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది. ఇటువంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. నిజమైన మైనర్‌ల మధ్య ప్రేమ సంబంధాలను పోక్సో చట్టంలోని కఠిన నిబంధనల నుంచి మినహాయించేలా ‘‘రోమియో–జూలియట్” క్లాజ్ ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు తెలిపింది. న్యాయమూర్తులు సంజయ్ కరోల్, ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
పిల్లల రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాన్ని వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని కోర్టు గుర్తించింది. ఇలాంటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శికి తీర్పు ప్రతిని పంపించాలని ఆదేశించింది. చట్టాన్ని తప్పుగా వాడే వారిపై చర్యలు తీసుకునే విధానం రూపొందించాలని సూచించింది. ఈ కేసు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టుకు చేరింది. ఒక మైనర్ బాలికకు సంబంధించిన కేసులో నిందితుడికి అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని యూపీ ప్రభుత్వం సవాల్ చేసింది.
విచారణ సందర్భంగా, పోక్సో కేసుల్లో బెయిల్ దశలోనే బాధితుల వయస్సు నిర్ధారణ కోసం తప్పనిసరి వైద్య పరీక్షలు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ విచారణను చిన్న స్థాయి ట్రయల్‌గా మార్చడం సరికాదని పేర్కొంది. హైకోర్టు రాజ్యాంగ న్యాయస్థానమే అయినా, ఈ కేసులో చట్టబద్ధ అధికార పరిధిని దాటిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టం బలంగా ఉండాలి. అదే సమయంలో నిర్దోషులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అసలీ రోమియో-జూలియట్ క్లాజ్ ఏంటి?
రోమియో అండ్ జూలియట్ క్లాజ్ (Romeo Juliet Clause) అనేది సమాన వయస్సు ఉన్న మైనర్‌లు లేదా యువతీ యువకుల పరస్పర అంగీకారంతో ఉన్న ప్రేమ సంబంధాలను తీవ్రమైన నేరాలుగా చూడకుండా రక్షించడానికి రూపొందించిన చట్టం. చాలా దేశాల్లో మైనర్లను రక్షించే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇద్దరు టీనేజ్ వారు పరస్పర అంగీకారంతో ప్రేమలో ఉన్నా ఒకరి వయస్సు చట్టపరంగా తక్కువగా ఉన్న కారణంతో వేరొకరిపై కఠిన నేరంగా కేసు నమోదు చేయవచ్చు.
రోమియో అండ్ జూలియట్ క్లాజ్ ఈ రకమైన అనవసర నేరాల నుండి రక్షించడానికి ఏర్పాటయింది. ఈ క్లాజ్ ప్రకారం, ఇద్దరూ సమీప వయస్సులో ఉండి, వారి ప్రేమ స్వచ్ఛందంగా ఉంటే, చట్టం శిక్షను తగ్గించవచ్చు లేదా కఠినమైన నేరాల నుంచి మినహాయింపు ఇవ్వవచ్చు. ఉదాహరణకు 17 ఏళ్ల అమ్మాయి, 18 లేదా 19 ఏళ్ల అబ్బాయి మధ్య ప్రేమ సంబంధాన్ని దాడి లేదా మోసం కేసు లాగా చూడవలసిన అవసరం ఉండదు.
ఈ క్లాజ్ ఉద్దేశం చైల్డ్ ప్రొటెక్షన్ చట్టాలను బలహీనపరచడం కాదు, కానీ వాటిని సామాన్య న్యాయం, సరైన దృష్టితో అమలు చేయడం. ఇది నిజమైన కిశోర ప్రేమ, దాడి, బలవంతం, మోసం వంటి కేసుల మధ్య స్పష్టమైన భేదాన్ని చూపిస్తుంది. రోమియో అండ్ జూలియట్ క్లాజ్ చట్ట రక్షణ, సామాజిక వాస్తవం, మానవీయ దయ మధ్య సమతుల్యతను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది, కాబట్టి యువత పరస్పర ఒప్పందంతో ఉన్న ప్రేమకు వయసు పరిమితుల కారణంగా శిక్ష విధించబడదు.
Read Also: హైవేపై ట్రాఫిక్ క్లియర్ చేసిన సినీ నిర్మాత
Follow Us On: Sharechat


