అరట్టై(Arattai).. ప్రస్తుతం దేశమంతా చర్చిస్తున్న అంశం. వాట్సాప్‌కు పోటీగా భారతదేశ సంస్థ జోహో తీసుకొచ్చిన మేసేజింగ్ యాప్‌యే అరెట్టై. తాజాగా అత్యున్నత న్యాయస్థానంలో కూడా ఈ పేరు వినిపించింది. తన వాట్సాప్ ఖాతాను పునరుద్దరించాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్ విచారణలో భాగంగా న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. వాట్సప్ లేకపోతే ఏం.. అరట్టై వినియోగించుకోవచ్చు కదా? అని తెలిపింది. పిటిషనర్ ఓ పాలి డయాగ్నిక్ సెంటర్‌లో పనిచేస్తున్నారని, గత 10-12 సంవత్సరాలుగా తన క్లయింట్‌లతో వాట్సాప్‌లోనే టచ్‌లో ఉన్నారని, కావున అతని ఖాతాను బ్లాక్ నుంచి తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరుపు న్యాయవాది కోరారు.
దానిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. అయితే ఏంటి? అని ప్రశ్నించింది. ‘‘కమ్యూనికేషన్ కోసం ఇతర యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకోవచ్చు కదా. ఇటీవల స్వదేశీ యాప్ ‘అరట్టై(Arattai)’ కూడా వచ్చింది. దాన్ని వాడుకోండి. మేక్ ఇన్ ఇండియా’’ అని పేర్కొంది. అనంతరం ఈ పిటిషన్ హైకోర్టులో కూడా విచారణకు అనర్హమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈదీనిపై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

