ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం

కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఏర్పడిన కొత్తలో రాష్ట్రంలో చోటుచేసుకున్న ‘ఓటుకు నోటు’ కేసు విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా రెండు కీలక పిటిషన్లను సుప్రీంకోర్టు బెంచ్ పరిగణనలోకి తీసుకున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దాఖలు చేసింది ఒక పిటిషన్ కాగా, మరొకటి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్. ఈ కేసు స్వభావాన్ని ఎన్నికల చట్టాల ప్రకారం మాత్రమే విచారించాలని సీఎం రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల ప్రకారమే విచారించాలన్నారు. క్రిమినల్ అవినీతి కేసుగా కాకుండా ఎన్నికల ఉల్లంఘనగా పరిగణించాలన్నారు. ఈ కేసు నుంచి తన పేరును పూర్తిగా తొలగించి విముక్తి కల్పించాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ నేతృత్వంలోని బెంచ్ దీన్ని విచారించి తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్‌లో.. తనపై నమోదైన ఆరోపణలకు తగిన ఆధారాలేవీ లేవన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పిటిషన్‌తో కలిపి దీన్ని విచారణకు తీసుకున్న సుప్రీంకోర్టు బెంచ్ (Supreme Court).. రెండింటినీ కలిపి విచారించనున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి జరిగే విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయాలు రాజకీయంగా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, నైతిక విలువలపై ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారనున్నది.

Read Also: మోదీపై తీవ్ర వ్యాఖ్యలు.. ఖర్గేకు నోటీసులు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>