హైకోర్టు తీర్పుతో ధర్మం గెలిచింది : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

కలం, జనగామ : జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy)స్వాగతించారు. ఈ తీర్పుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలు బట్టబయలు అయ్యాయని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరకు ధర్మమే గెలుస్తుందని ఈ తీర్పు నిరూపించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేవలం మేడిగడ్డకే పరిమితం కాదని, అనేక బ్యారేజీలు, కాలువలు, టన్నెల్స్, రిజర్వాయర్లు కలిపిన సమగ్ర ప్రాజెక్ట్ అని వివరించారు. ఆలేరు నుంచి భువనగిరి, కొండపోచమ్మ, మల్లన్నసాగర్, అన్నపూర్ణసాగర్, రంగనాయక్ సాగర్, అప్పర్ మానేరు, లోయర్ మానేరు వరకు విస్తరించిన మహత్తర యజ్ఞమే కాళేశ్వరం అని ఆయన చెప్పారు.

ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర జలవనరుల సంఘంతో పాటు సుమారు 16 సంస్థల అనుమతులు లభించాయని, రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో అమలైన సమిష్టి నిర్ణయమని తెలిపారు. అలాగే ఆర్ఈసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి ఆర్థిక సంస్థలు పరిశీలించిన తర్వాతే రుణాలు మంజూరు చేశాయని గుర్తుకు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవేనని పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద రెండు స్తంభాలు కుంగిన ఘటనను ఆధారంగా తీసుకుని మొత్తం ప్రాజెక్ట్‌ను విమర్శించడం సరికాదని హితవు పలికారు.

ఆ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన ప్రభుత్వం, రెండున్నరేళ్లుగా నిర్లక్ష్యం చేయడం దురుద్దేశపూరితమని ఆయన విమర్శించారు. హైకోర్టు తీర్పుతో బీఆర్‌ఎస్ (BRS) పార్టీ మొదటి నుంచి చెప్పిన విషయాలే నిజమని తేటతెల్లమైందని పేర్కొన్నారు. అసంపూర్తి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడం ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టుగా మారిందని వ్యాఖ్యానించారు. ఇకనైనా కక్షసాధింపు రాజకీయాలు మానుకుని రైతుల ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని సూచించారు. కుంగిన స్తంభాలకు తక్షణమే మరమ్మతులు చేపట్టి, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను (Kaleshwaram Project) పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, రైతుల సంక్షేమాన్ని కాపాడాలని పల్లా డిమాండ్ చేశారు.

Read Also: మోదీపై తీవ్ర వ్యాఖ్యలు.. ఖర్గేకు నోటీసులు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>