కలం, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మినహాయించి శాశ్వత న్యాయమూర్తుల సంఖ్య 33గా ఉంది. దీన్ని 37కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ ఆర్డినెన్స్ 2026ను తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి సంతకం చేయడంతో ఇది తక్షణమే అమలులోకి వచ్చింది. ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 38కి చేరుతుంది.
ఇటీవలే కేంద్ర కేబినెట్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పార్లమెంట్ సమావేశాలు లేని కారణంగా ఆర్డినెన్స్ రూపంలో ఈ సవరణను తీసుకువచ్చారు. 1956 నాటి సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని సవరిస్తూ సెక్షన్ 2లో 33 అనే పదానికి బదులుగా 37 అని మారుస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదలయింది.
దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రస్తుతం 92 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేసుల విచారణను వేగవంతం చేయడానికి, రాజ్యాంగ ధర్మాసనాల ఏర్పాటుకు ఆటంకం కలగకుండా ఉండటానికి ఈ అదనపు పోస్టులు ఎంతగానో దోహదపడతాయని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. చివరిసారిగా 2019లో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను 30 నుండి 33కి పెంచారు.
Read Also: సేవా సంస్థను ప్రారంభించిన మంచు మనోజ్!
Follow Us On : WhatsApp

