కలం వెబ్ డెస్క్ : ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసు(Delhi riots case)లో ప్రధాన నిందితులుగా ఉన్న ఉమర్ ఖలీద్(Umar Khalid), షర్జీల్ ఇమామ్(Sharjeel Imam)లకు సుప్రీం కోర్ట్(Supreme Court)లో నిరాశ ఎదురైంది. వీరి బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చుతూ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ఇదే కేసులో శిక్ష అనుభవిస్తున్న మరో ఐదుగురు నిందితులకు మాత్రం బెయిల్ మంజూరు చేసింది.
2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ అల్లర్లలో 53 మంది మరణించగా, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలపై నమోదైన యూఏపీఏ కేసులో విద్యార్థి నేతలు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లు అరెస్ట్ అయ్యారు. సోమవారం ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఎంతో ముఖ్యమని, విచారణకు ముందే ఎక్కువ కాలం జైలులో ఉంచడం ఆందోళనకరమని కోర్టు అంగీకరించింది. అయితే, స్వేచ్ఛ అనేది సమాజ భద్రత కంటే ముఖ్యం కాదని పేర్కొంది.
యూఏపీఏ చట్టంలోని సెక్షన్ 43D(5) అనేది శాసనసభ నిర్ణయమని, ప్రాథమిక ఆధారాలు నేరాన్ని ధృవీకరిస్తున్నప్పుడు న్యాయస్థానాలు ఈ చట్టపరమైన ఆంక్షలను విస్మరించలేవని కోర్టు స్పష్టం చేసింది. ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లు ఈ కుట్రలో కీలక పాత్ర పోషించారని ప్రాథమిక ఆధారాలు స్పష్టం చేస్తున్నట్లు కోర్టు అభిప్రాయపడింది. వీరి కస్టడీ కాలం ఇంకా చట్టపరమైన పరిమితులను దాటలేదని కోర్టు భావించింది. మిగిలిన నిందితులకు బెయిల్ వచ్చినందున తమకు కూడా ఇవ్వాలన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. ప్రతి నిందితుడి పాత్రను విడివిడిగా పరిశీలించాల్సిన బాధ్యత కోర్టుపై ఉంటుందని, ఖలీద్, షర్జీల్‌ల పాత్ర మిగిలిన వారితో పోలిస్తే భిన్నంగా ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితులపై తీవ్ర ఆరోపణలున్నాయని, విచారణ ముందస్తు దశలో ఉన్నందున వారిని విడుదల చేయడం వల్ల ప్రాసిక్యూషన్ కేసుకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ధర్మాసనం భావించింది. ఈ మేరకు వారి బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.


