కలం, వెబ్ డెస్క్ : గత ప్రభుత్వంలో జరిగిన పోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ప్రశ్నించడం, విచారించడం, ఎంక్వయిరీ చేయడం.. ఈ ప్రక్రియను వీలైనంత తొందరగా ముగించాలని పోలీసులకు సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. అవసరమైతే ప్రభాకర్‌రావును మళ్ళీ కస్టడీలోకి తీసుకుని వివరాలను రాబట్టాలని సూచించింది. పోలీసులు పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని, ఎంక్వయిరీకి సహకరించాలని ఆయనకు స్పష్టంగా చెప్పామని జస్టిస్ నాగరత్న గుర్తుచేశారు. ఈ పిటిషన్‌ను ఇంకా ఎంతకాలం తాము విచారిస్తూనే ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రభాకర్‌రావుకు రెండు వారాల కస్టడీని ఇచ్చామని, ఆయనను ప్రశ్నించారని, పోలీసులకు సహకరించాల్సిందిగా తాము కూడా సూచించామని ఆమె గుర్తుచేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభాకర్ రావు విచారణకు సహకరించాడు కదా… ఒకవేళ మీకు వేరే ఉద్దేశాలు ఉంటే ప్రోత్సహించలేమని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు.
ముందస్తు బెయిల్ ఎంక్వయిరీకి అడ్డం కాదు :
తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకుని, ఈ కేసులో(Phone Tapping Case) మూడు లీగల్ అంశాలున్నాయన్నారు. విదేశాల్లో ఉంటూ తప్పించుకుంటున్న వ్యక్తిగా ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. ఒకసారి కస్టడీకి కోర్టు అనుమతించినందున ఆయనకు జారీచేసిన ముందస్తు బెయిల్ సహేతుకమేనా అని ప్రశ్నించారు. దీనికి జస్టిస్ నాగరత్న స్పందిస్తూ, ఆర్టికల్ 142 ప్రకారం ఆయనకు ముందస్తు బెయిల్ ఒక మధ్యంతర ఉత్తర్వుగానే ఇచ్చామని, అంతమాత్రం చేత ఆయనను ఎంక్వయిరీకి పిలిచి వివరాలను రాబట్టకూడదనే ఆంక్షలేవీ లేవని వివరించారు. ఆయన నుంచి ఏం వివరాలు కావాలనుకుంటున్నారో సేకరించవచ్చన్నారు. ఇప్పటికైనా ఆయనను మళ్ళీ ఎంక్వయిరీకి పిలిచి ప్రశ్నించవచ్చన్నారు. తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేశారు.
Read Also: మెట్రో రెండో దశపై సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ
Follow Us On: X(Twitter)


