కలం, కరీంనగర్ బ్యూరో: మిడ్ మానేరు జలాశయం ఎండిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అని బీఆర్ఎస్ నేత, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ (Sunke Ravishankar) ఆరోపించారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో సముద్రంలా తలపించే రాజరాజేశ్వర జలాశయం నేడు కాంగ్రెస్ పాలనలో ఎడారిలా మారిందన్నారు. చొప్పదండి నియోజకవర్గం పార్టీ నాయకులతో కలిసి ఆదివారం రాజరాజేశ్వర (మిడ్ మానేర్) జలాశయం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
కుంగిన పిల్లర్లను మరమ్మతులు చేయాలి
తెలంగాణకే గుండెకాయ అయినటువంటి మిడ్ మానేరు జలాశయం పూర్తిగా ఎండిపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పాలనలో బృహత్తరమైన కాళేశ్వర ప్రాజెక్టు కట్టి, తెలంగాణకు సాగునీరు తాగునీరు గుర్తు లేకుండా చూసామని, నేడు దౌర్భాగ్య కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోక పోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్లను వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ కింద నీటిని ఎత్తిపోసి చెరువులు, కుంటలు నింపాలని కోరారు. లేకపోతే ఇప్పటికే నీటి కొరతతో నాట్లు ఎండిపోతున్నాయని, రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని హెచ్చరించారు. రైతులను ఆదుకోవాలంటే వెంటనే సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టాలని సుంకే రవిశంకర్ డిమాండ్ చేశారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎడారిలా మారిన మానేరులో కబడ్డీ క్రికెట్ ఆట ఆడి నిరసన వ్యక్తం చేశారు.

