కలం, హనుమకొండ: సీపీఐ (CPI) జాతీయ సమితి పిలుపు మేరకు హనుమకొండ (Hanumkonda) జిల్లాలో గురువారం దేశవ్యాప్త పాదయాత్ర ప్రారంభమైంది. కాజీపేటలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు పాదయాత్ర (Padayatra) ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులు, కార్మికులు, సామాన్య ప్రజల ప్రయోజనాలను విస్మరించిందని ఆరోపించారు.
తెలంగాణకు ఇచ్చిన హామీలు, బయ్యారం ఉక్కు కర్మాగారం, ములుగు గిరిజన విశ్వవిద్యాలయం వంటి అంశాలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి తదితర నాయకులు పాల్గొన్నారు.

