కలం, వెబ్‌డెస్క్: ఏపీలోని విశాఖపట్నంలో స్పోర్ట్స్ సెంటర్ (Sports Center) నిర్మాణం కోసం ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) చేసిన భూమి పూజపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. గతంలో వైఎస్ జగన్ హయాంలోనే భూ కేటాయింపులు, పూజ జరిగాయని, ఇప్పుడు కేవలం లోకేశ్ తన ప్రచారం కోసం మళ్లీ భూమి పూజ చేశారని విమర్శిస్తున్నారు. అలాగే పలువురు నెటిజన్లు రెండో సారి భూమి పూజ చేయడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పీవీ సింధు ఎక్స్ వేదికగా స్పందించారు. మళ్లీ భూమి పూజల చేయడానికి గల కారణాలను వివరిస్తూ సుధీర్ఘ పోస్ట్ చేశారు.
సోషల్ మీడియాతో పాటు వ్యక్తిగతంగా కూడా చాలా మంది తనను భూమి పూజ మళ్లీ ఎందుకు చేశారని అడిగారని సింధు తెలిపారు. గతంలో చేసిన పూజకు తనకు కేవలం ఏడు గంటల ముందే సమాచారం ఇచ్చారని, దీంతో హడావుడిగా నిర్వహించాల్సి వచ్చిందని సింధు అన్నారు. ఆ మొదటి భూమి పూజలో తన ఫ్యామిలీ, సన్నిహితులు, గ్రీన్‌కోకు చెందిన స్వాతి, అనిల్, అలాగే తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం మొదటి నుంచి తనతో ఉన్న ఎంతో మంది ఆ వేడుకలో పాల్గొనలేకపోయారని చెప్పారు. అందుకే మళ్లీ భూమి పూజ చేసినట్లు తెలిపారు.
అలాగే గతంలో అనుకున్నట్లు దీన్ని కేవలం బ్యాడ్మింటన్ అకాడమీగా కాకుండా క్రీడలు. విద్యను సమగ్రంగా అందించే ఒక గొప్ప సంస్థగా విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అందుకే కొంతకాలం గత ప్రణాళికను ఆపి, ఇప్పుడు సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో మరింత పెద్ద దిశగా ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ కొత్త ప్రయాణాన్ని మళ్లీ ప్రారంభిస్తున్న సందర్భంగా తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులు అందరూ ఈ ఆనందాన్ని తనతో కలిసి పంచుకోవాలని కోరుకున్నట్లు సింధు తెలిపారు. ఈ కొత్త ప్రారంభానికి లోకేశ్ అన్న హాజరుకావడం తనకు ఎంతో గౌరవంగా అనిపించిందని సింధు తెలిపారు. 2028లోపు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు వెల్లడించారు.

