Mobile Popup Ad
Mobile Popup Ad

తాగునీటి సంక్షోభం.. అడుగంటిన భూగర్భ జలాలు

కలం, నిర్మల్ : గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఎండల తీవ్రత పెరగడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల ప్రజలు నీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్ (Nirmal) జిల్లా నర్సాపూర్ (జి) మండలం బూరుగుపల్లి, బూరుగుపల్లి తండా సూర్యం తండా గ్రామంలో తాగు నీటి కోసం ప్రజలు తిప్పలు పడుతున్నారు. గ్రామంలోని బోర్లు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల కుటుంబ అవసరాలకు సరిపడా నీరు దొరకడం కష్టమవుతోంది. ఒక్క బిందె నీటికోసం పెద్ద కష్టాలు పడాల్సి వస్తోంది. మిషన్ భగీరథ నీటి పైపులైన్లలో సరైన ఒత్తిడి లేకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైంది. రోజుకు ఒకసారి మాత్రమే నీరు రావడం, అది కూడా కొద్దిసేపే రావడంతో ప్రజలు నిల్వ చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా మహిళలపై ఈ సమస్య అధిక భారం మోపుతోంది. కుటుంబ అవసరాలకు సరిపడా నీటి కోసం గంటల సమయం వెచ్చించాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మిషన్ భగీరథ నీరే దిక్కు..

గ్రామ ప్రజలకు ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరే ప్రధాన ఆధారం. ప్రతి రోజు గంట సేపు మాత్రమే నీటిని అధికారులు సరఫరా చేస్తున్నారు. ఒకవేళ సరఫరా ఆలస్యమైతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి కోసం బిందెలతో గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళలు, వృద్ధులు, చిన్నారులు కూడా ఎండను లెక్కచేయకుండా మిషన్ భగీరథ నల్లా వద్ద నీటి కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఇతర నీటి వనరులు లేకపోవడంతో భగీరథ నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది.

అధికారులు పరిష్కారం చూపాలి..

ప్రతి ఏటా ఎండాకాలం వచ్చిందంటే నీటి ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలం ప్రారంభమై మూడు వారాలు గడుస్తున్న ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో నీటి కష్టాలు మరింత పెరిగాయి. గ్రామంలో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదనపు బోర్లు తవ్వించడం, మిషన్ భగీరథ ద్వారా క్రమబద్ధమైన సరఫరా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>