కాంబోజ్ బౌలింగ్‌పై గవాస్కర్ ప్రశంసలు

క‌లం, స్పోర్ట్స్: న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌కు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఫిదా అయ్యాడు. అద్భుతమైన లైన్, లెంగ్త్‌తో కివీస్ బ్యాటర్లను కట్టడి చేసిన కాంబోజ్‌ను ప్రశంసించాడు. గతంతో పోలిస్తే అతడి వేగం, ఫిట్‌నెస్ బాగా మెరుగయ్యాయని కొనియాడాడు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కాంబోజ్ అదరగొట్టాడు. తన పూర్తి 10 ఓవర్ల కోటాలో కేవలం 22 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇందులో 46 డాట్ బాల్స్, రెండు మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

పేస్ పెరిగిందన్న గవాస్కర్

కాంబోజ్ బౌలింగ్‌ను విశ్లేషించిన గవాస్కర్.. ఇంగ్లండ్ పర్యటనతో పోలిస్తే అతడి వేగం పెరిగిందని తెలిపాడు. గతంలో గంటకు 127-130 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన కాంబోజ్.. ఇప్పుడు 135 కిలోమీటర్లకు పైగా వేస్తున్నాడని పేర్కొన్నాడు. ఫిట్‌నెస్ మెరుగుపడటమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డాడు. కాంబోజ్ ఆఫ్ స్టంప్, దాని బయటే బంతులు వేస్తూ బ్యాటర్లను కట్టడి చేశాడని గవాస్కర్ వివరించాడు. సరైన రిథమ్, ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేయడం వల్లే వేగం పెరిగిందని విశ్లేషించాడు.

ఈడెన్ పార్క్ పిచ్‌పై లభించిన స్వింగ్, బౌన్స్‌ను కూడా కాంబోజ్ చక్కగా ఉపయోగించుకున్నాడని ప్రశంసించాడు. టీ20 ప్రభావంతో వన్డేల్లో బ్యాటర్ల ఆటతీరు పూర్తిగా మారిందని గవాస్కర్ పేర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో 10 ఓవర్లలో 22 పరుగులే ఇవ్వడం గొప్ప విషయమని కొనియాడాడు. వైవిధ్యాల కోసం ప్రయత్నించకుండా ఒకే లైన్, లెంగ్త్‌ను కొనసాగించడం వల్ల బ్యాటర్లపై ఒత్తిడి పెరిగిందని వివరించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>