కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) నేతల మధ్య వివాదాలు ఆ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఒక వివాదం సమసిపోగానే మరొకటి తెరపైకి రావడంతో వివాదాస్పద నేతల వైఖరి పట్ల పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య గొడవలు, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం నిత్యకృత్యంగా మారింది. తాజాగా ఛలో ఢిల్లీ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, మంత్రి దామోదర రాజనర్సింహా మధ్య జరిగిన గొడవ.. పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రతిష్టాత్మక కార్యక్రమంలో నేతలు గొడవపడటం ఇబ్బందికరంగా మారిందని వర్గాలు పేర్కొన్నాయి. లక్ష్మీకాంతరావు ఇప్పటికే మంత్రిపై టీపీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐసీసీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
ఎంపీ వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్ బాబు అంతర్గత పోరు
మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మధ్య అంతర్గత పోరు నెలకొన్నదనే టాక్ పార్టీలో నడుస్తున్నది. ఇరు వర్గాలు విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి నిరసన ర్యాలీకి మంత్రి శ్రీధర్ బాబు, ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవద్దని, సస్పెండ్ చేయవద్దంటూ మంత్రికి వంశీకృష్ణ వ్యంగ్యంగా లేఖ రాయడంతో వివాదం ముదిరింది. ఈ రచ్చ ఏ మలుపు తిరుగుతుందోనన్న చర్చ నడుస్తున్నది.
మంత్రి వివేక్ వర్సెస్ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు
మంత్రి వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇటీవల ప్రేమ్‌సాగర్ రావు మంత్రి వివేక్‌పై బహిరంగంగానే విమర్శలు చేయడంతో అంతర్గత పోరు రచ్చకెక్కింది.
కొండా సురేఖ వర్సెస్ ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలు
కొండా సురేఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలకు, ఆమెకు మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ వివాదం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లడంతో కొండా మురళి, పలువురు ఎమ్మెల్యేలు కమిటీ ముందుకు హాజరయ్యారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కొండా సురేఖ టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచారు.
మంత్రి వెంకట్ రెడ్డి వర్సెస్ డీసీసీ అధ్యక్షుడు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పున్న కైలాష్కు డీసీసీ పదవి ప్రకటించిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా మంత్రి కోమటిరెడ్డి రాసిన లేఖ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఇద్దరి మధ్య సఖ్యత లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నేతల మధ్య చోటుచేసుకుంటున్న విభేదాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని, వీటిని క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని హస్తం నేతలు కోరుతున్నారు. పార్టీ లైన్ దాటి వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తేనే పార్టీ (Telangana Congress) ఇమేజ్ పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

