కలం, ఖమ్మం బ్యూరో: రిజిస్ట్రేషన్, తహసీల్దార్ ఆఫీసులు అడ్డగా స్టాంప్ పేపర్ల దందా (Stamp Paper Scam) జోరుగా సాగుతోంది. స్టాంప్ వెండర్లు, దళారులు కలిసి దోపిడీకి పాల్పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బాండ్ పేపర్ల (నాన్-జ్యుడీషియరీ) అధిక ధరలు అక్రమాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన అధికారిక ధరలను, ముద్రిత విలువలకు విరుద్ధంగా వసూలు చేస్తున్నారు. రూ. 100 విలువైన బాండు పేపర్‌ను రూ. 150 నుంచి రూ. 200 వరకు అమ్ముతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వం నుంచి కమీషన్ వస్తున్నా..చట్టపరమైన ఒప్పందాలు, అద్దె ఖరారు, ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, అఫిడవిట్లు, వివిధ హామీ పత్రాల కోసం వినియోగించే బాండ్ పేపర్లు ప్రభుత్వం ద్వారా అధికారికంగా ముద్రించబడతాయి. వీటిపై స్టాంప్ డ్యూటీ కూడా ముద్రించబడి ఉంటుంది. సాధారణంగా రూ. 10, రూ. 20, రూ.50, రూ. 100, రూ. 500 అంతకంటే ఎక్కువ విలువల్లో లభించే బాండ్లను అధీకృత స్టాంప్ వెండర్లు, పోస్టాఫీసులు, బ్యాంకుల్లో కొనుగోలు చేయొచ్చు.
ఉమ్మడి జిల్లాలో సుమారు 150 నుంచి 250 మందికి పైగా లైసెన్స్డ్ స్టాంప్ వెండర్లు ఉన్నారు. వీరు రోజుకు రూ. 10 లక్షల నుంచి రూ.30లక్షల వరకు అమ్మకాలు జరుపుతారని మార్కెట్ వర్గాల అంచనాగా ఉంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ట్రెజరీ లేదా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ద్వారా హోల్‌సేల్ ధరకు బాండు పేపర్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారం నిమిత్తం ప్రభుత్వమే వీరికి 5%వరకు అధికారిక కమీషన్‌ను కూడా చెల్లిస్తుంది.
కృత్రిమ కొరత పేరిట అక్రమాలు
అయితే.. క్షేత్రస్థాయిలో బాండ్ పేపర్లను అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. కృత్రిమ కొరత సృష్టించి ఇష్టానుసారంగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. భూముల క్రయవిక్రయాలు, బ్యాంకు రుణాలు, అద్దె ఒప్పందాలు, వివిధ న్యాయపరమైన అవసరాల కోసం కోర్టులు, తహసీల్దార్ ఆఫీసులకు వచ్చే సామాన్యులు గత్యంతరం లేక అడిగినంత చెల్లిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బాండు పేపర్లు పుష్కలంగా ఉన్నప్పటికీ, కావాలనే కొరత ఉందంటూ వెండర్లు ప్రచారం చేస్తున్నారు.
అత్యవసర సమయాల్లో బాండ్లు దొరకవని ఆందోళన చెందే ప్రజల లావాదేవీలను క్యాష్ చేసుకుంటూ బ్లాక్ దందాకు పాల్పడుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో, కోర్టుల ఆవరణల్లో తిష్టవేసిన డాక్యుమెంట్ రైటర్లు, బ్రోకర్లతో సిండికేట్‌గా దందాను కొనసాగిస్తున్నారు. అక్రమ దందాలపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వెండర్ల దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. అక్రమ వెండర్లపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపితేనే సామాన్యుడికి నిజమైన న్యాయం జరుగుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం : శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఖమ్మం
బాండ్ పేపర్లలో స్టాంప్ వెండర్ల అక్రమ వసూళ్లపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఎవరైనా చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. దందా (Stamp Paper Scam) చేసేవారి లైసెన్స్ కూడా రద్దు చేస్తాం. జిల్లాలో బాండు పేపర్లు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి కొరత లేదు.ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. స్టాంప్ వెండర్ల అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఈ-స్టాంపింగ్’ వంటి ప్రత్యామ్నాయాలను అమలు చేస్తుంది. అయినా ఎక్కడైనా దళారులు అధిక ధరకు బాండ్ పేపర్లను అమ్మితే స్థానిక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
Also Read : చారిత్రక విజయం: సౌత్ కరోలినా సెనెటర్‌గా ఆనీ ఆండ్రూస్!
Follow Us On : WhatsApp

