యూత్ ఒలింపిక్స్ సెమీస్‌లో తన్వి పట్రి

క‌లం, స్పోర్ట్స్: డాకర్ యూత్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ యువ క్రీడాకారిణి తన్వి పట్రి (Tanvi Patri) పతకానికి అడుగు దూరంలో నిలిచింది. బాలికల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరింది. థాయ్‌లాండ్‌కు చెందిన కుంగ్‌కేవ్ కకానిక్‌ను వరుస గేముల్లో ఓడించింది. మరో విజయం సాధిస్తే భారత్‌కు పతకం ఖాయం కానుంది. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో మూడో సీడ్ తన్వి 21-17, 21-13తో ఏడో సీడ్ కకానిక్‌పై గెలిచింది. ఈ మ్యాచ్ 39 నిమిషాల పాటు సాగింది. టోర్నీలో ఇప్పటివరకు ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా సెమీస్‌కు చేరడం తన్వి ఫామ్‌కు నిదర్శనం. సెమీఫైనల్లో తన్వి జపాన్‌కు చెందిన రెండో సీడ్ యుజునో వతనాబేతో తలపడనుంది.

గతంలో వీరిద్దరూ ఒక్కసారి ఎదురుపడ్డారు. 2024లో జరిగిన ఆ మ్యాచ్‌లో తన్వి ఓడిపోయింది. ఇప్పుడు వతనాబేపై గెలిస్తే కనీసం రజత పతకం ఖాయమవుతుంది. యూత్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పతకం సాధించిన తొలి భారత అమ్మాయిగా తన్వి చరిత్ర సృష్టిస్తుంది. 15 ఏళ్ల తన్వి ఒడిశాలోని బాలాసోర్‌కు చెందినది. 2024లో ఆసియా అండర్-15 టైటిల్ గెలిచింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా అండర్-17 టైటిల్ కూడా సాధించింది. ఈ రెండు టైటిళ్లు గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది.

ఇటీవల ఇండోనేషియాలో జరిగిన పొంటియానక్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్‌లోనూ విజేతగా నిలిచింది. మరోవైపు బాలుర సింగిల్స్‌లో భారత ఆటగాడు దేవ్ రూపరేలియా క్వార్టర్‌ఫైనల్లో ఓడిపోయాడు. చైనాకు చెందిన హాంగ్ టియాన్ యుయే చేతిలో 22-24, 10-21తో పరాజయం పాలయ్యాడు. దీంతో బాలుర విభాగంలో భారత్ పోటీ ముగిసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>