కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో వేసవి ఉక్కపోతతో బాధపడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. రాష్ట్ర వాతావరణం (Telangana Weather) ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40°C కంటే తక్కువగానే నమోదు అయినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావం వలన తెలంగాణలో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.
ఈ మేరకు నేడు, రేపు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో గంటకు 30 – 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. అయితే ఈ ఉపశమనం కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుందని, ఎల్లుండి నుండి రాష్ట్రంలో మళ్లీ పొడి వాతావరణం ఏర్పడుతుందని స్పష్టం చేసింది. ఉష్ణోగ్రతలు మళ్లీ 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

