కలం, వెబ్ డెస్క్ : పేద బ్రాహ్మణుల అభ్యున్నతి, బ్రాహ్మణ సమాజ ఐక్యతే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు బ్రాహ్మిణ్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ స్టీరింగ్ కమిటీ ( BOSS Steering Committee) స్పష్టం చేసింది. హైదరాబాద్ నాగోల్‌లోని వసంత్ విహార్ ఫంక్షన్ హాల్‌లో BOSS స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో బ్రాహ్మణుల చైతన్య సదస్సు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 500–600 మందికి పైగా బ్రాహ్మణులు, ముఖ్యంగా మహిళలు ఈ సమావేశానికి పోటెత్తారు.
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ (TBSP) చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి దిశానిర్దేశం చేశారు. TBSP చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో.. BOSS సంస్థాగత విధివిధానాలను స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో మరింత ముందుకు తీసుకెళ్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.
ఈ క్రమంలో BOSS ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయదని, కేవలం పేద, ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణుల సంక్షేమం కోసం మాత్రమే ఈ వేదిక పనిచేస్తుందని బసవరాజు శ్రీనివాస్ స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, గృహ వసతి కల్పనే ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా “దుదిళ్ల శ్రీపాదరావు అగ్రహారం – Affordable Housing Society” పేరిట సుమారు 3,000 నివాస గృహాలను గేటెడ్ కమ్యూనిటీ హంగులతో, సాధ్యమైనంత తక్కువ నిర్మాణ వ్యయానికే పేద కుటుంబాలకు అందించే అద్భుతమైన ప్రణాళికను వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమం అందరిదీ
తెలంగాణ ఉద్యమాన్ని ఏ ఒక్క కులానికో పరిమితం చేయవద్దని, సబ్బండ వర్గాలు, అన్ని కులాల ప్రజలు ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న ఈ ప్రజా ఉద్యమాన్ని ఒక వర్గానికి ఆపాదించడం తగదని బసవరాజు శ్రీనివాస్ హితవు పలికారు. అటు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం, పబ్బం గడుపుకోవడం కోసం ప్రభుత్వాన్ని, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను విమర్శిస్తూ బ్లాక్‌మెయిల్ చేసే వారిని సమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విభేదాలు రెచ్చగొట్టేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. బ్రాహ్మణ కుటుంబాల ఆర్థిక స్వావలంబన కోసం త్వరలోనే ‘శ్రీపాద తెలంగాణ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ఎండోమెంట్ పరిధిలోని అన్ని దేవాలయాల పాలకమండళ్లలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలని, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అలాగే సరైన సంక్షేమ పథకాల రూపకల్పన కోసం BOSS చేపడుతున్న బ్రాహ్మణ కులగణనలో ప్రతి కుటుంబం స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు వచ్చే సెప్టెంబర్ 6వ తేదీన ప్రతిష్టాత్మకంగా ‘బ్రాహ్మణ యువ సమ్మేళనం’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా బ్రాహ్మణ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని BOSS స్టీరింగ్ కమిటీ పిలుపునిచ్చింది. అలాగే “బ్రాహ్మణ సమాజాన్ని చీల్చడం కాదు, కలపడం మా లక్ష్యం. వ్యక్తిగత ప్రయోజనాలు కాదు సమాజ ప్రయోజనమే మా ప్రాధాన్యం. విమర్శలు కాదు నిర్మాణాత్మక సేవే మా మార్గం” అని BOSS స్టీరింగ్ కమిటీ స్పష్టం చేసింది.

