కలం, నిజామాబాద్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే మహోన్నత సంకల్పంతో మహిళల అభ్యున్నతి కోసం విస్తృత కార్యక్రమాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాన్ని పురస్కరించుకుని మండల మహిళా సమాఖ్యలకు ప్రభుత్వం కేటాయించిన ఆర్టీసీ అద్దె బస్సులను వారికి అందజేశారు. సోమవారం నిజామాబాద్ (Nizamabad) కలెక్టరేట్ లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి బస్సులను లాంఛనంగా ప్రారంభించారు.
మహిళా సంఘాలకు రూ. 1100 కోట్ల ఆర్థిక సహాయం
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం విరివిగా రుణాలు అందిస్తోందన్నారు. అంతే కాకుండా సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులు, స్కూల్ యూనిఫాంల స్టిచింగ్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ వంటి ద్వారా మహిళల ఆర్థిక ప్రగతికి తోడ్పాటును అందిస్తోందని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్లను, రేషన్ కార్డులను కూడా మహిళల పేరిట మంజూరు చేస్తోందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల స్వల్ప కాలంలోనే కేవలం నిజామాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 1100 కోట్ల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు.
ఆహార ఉత్పత్తులను తయారు చేయాలి..
కేవలం మహిళలు అనే కాకుండా అన్ని వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు ఎంతమాత్రం లేదన్నారు. ప్రజలు కూడా వాస్తవాలను గమనించాలని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ పిల్లల చక్కటి భవిష్యత్తు కోసం అన్ని వసతులు, నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ బడులలో చేర్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలని, తద్వారా అనవసర ఆర్థిక దుబారాను నివారించుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా ప్రజలకు ఆరోగ్యాల పరిరక్షణకు దోహదపడే ఆహార ఉత్పత్తులను తయారు చేయాలని సూచించారు.
జిల్లాలోనే అత్యధికంగా వడ్డీ లేని రుణాలు..
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. మహిళల గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేసేలా ప్రభుత్వం విస్తృత స్థాయిలో కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే జిల్లాకు 18 అద్దె బస్సులను కేటాయించిందని తెలిపారు. అద్దె బస్సుల నిర్వహణను పక్కాగా పర్యవేక్షణ జరపాలని సమాఖ్య ప్రతినిధులకు సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు నిజామాబాద్ జిల్లాలోనే అత్యధికంగా వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సరికొత్త ఆలోచనలతో ప్రణాళికాబద్దంగా కృషి చేస్తే వ్యాపార పరంగా అద్భుత విజయాలు సాధించవచ్చని అన్నారు. నిజామాబాద్ నగరంలో కలెక్టరేట్ కు ఆనుకుని అన్ని హంగులతో నూతనంగా నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనం త్వరలోనే అందుబాటులోకి రానుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డాక్టర్ కవితా రెడ్డి, అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్డీఏ సాయన్న, ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు హేమలత, మండల మహిళా సమాఖ్యల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

