కలం, కరీంనగర్ బ్యూరో: వరి ధాన్యం చివరి గింజ వరకూ కొంటామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుడా చైర్మన్ (SUDA Chairman) కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్ మండలం నగునూర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. అక్కడినుండే అధికారులతో మాట్లాడి, ప్రత్యేక గోదాములను కేటాయించే విధంగా సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా రైతులతో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని చెప్పారు. వారంలోగా సెంటర్ ఎత్తివేస్తామని, అకాల వర్షాలు పడ్డా రైతులు ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. వాహనాల కొరత, హమాలీల కొరత వల్ల అక్కడక్కడ కొంత ఇబ్బంది ఏర్పడిందని, అయినప్పటికీ రైతుకు ఎటువంటి నష్టం కలుగనీయమని నరేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పెంచాల లక్ష్మణ్ రావు, ఉప సర్పంచ్ హన్మంత రావు, సెంటర్ ఇంచార్జి అజయ్, అశోక్ రెడ్డి, కృష్ణా రెడ్డి, సాయిల్ల రాజు, శేఖర్ తదితరులు ఉన్నారు.

