కలం, వెబ్ డెస్క్: గుజరాత్‌లో ఎబోలా కేసు కలకలం రేపుతోంది. ముంబయి నుంచి వడోదరకు వచ్చిన కాంగోకు చెందిన వ్యాపారవేత్త తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో స్థానిక బ్యాంకర్ ఆసుపత్రిలో చేరగా.. అతడికి ఎబోలా వ్యాధి తరహా లక్షాలను వైద్యులు గుర్తించారు. వెంటనే, అతడి రక్త నమూనాలను పుణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. అనంతరం, సదరు వ్యాపారవేత్తను వడోదర నుంచి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో చేర్చినట్లు వైద్యులు తెలిపారు.
ముగ్గురు వ్యక్తులు ఐసోలేషన్‌లోకి..
వ్యాపారవేత్తతో సన్నిహితంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు ఐసోలేషన్‌లోకి వెళ్లాలని వైద్యులు సూచించారు. సదరు వ్యాపారవేత్త ఎక్కడి నుంచి వచ్చాడు.. ఎక్కడెక్కడ వెళ్లాడనే దానిపై వైద్యాధికారులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటివరకు దేశంలో ఎక్కడా ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాంగో వ్యాపారవేత్త రక్త నమూనాల రిపోర్ట్ వస్తే గానీ, అతడికి వ్యాధి ఉన్నదీ.. లేనిదీ.. నిర్ధారణ కానుంది.

