కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు అన్నారు. దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్ధి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. నగరంలో నిర్మాణంలో ఉన్న ఎఫ్‌సీడీఏ కార్యాలయం, స్కిల్ యూనివర్సిటీ పనులను గురువారం పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అత్యాధునిక వసతులు, సాంకేతికతత పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ఈ సందర్భంగా పొంగులేటి (Ponguleti Srinivasa Reddy) మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీకి అనేక ఆటుపోట్లు ఎదురైనా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ఈ ప్రాంతానికి, రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా ఫ్యూచర్ సిటీ కోసం ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతుందని అన్నారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రతి నిర్ణయం, ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా స్పష్టమైన కార్యాచరణతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాలు కల్పించాలనే మంచి ఆలోచనలతో ఈ ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రపంచంలో, ఏదేశంలో, ఏ రాష్ట్రానికి రాని ఆలోచన ఈ రాష్ట్రానికి వచ్చిందని కొనియారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, సహచర మంత్రుల మంతా చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలు సహకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ఏ రకంగా కలలు కంటున్నాయో.. ఆ కలలను దీవేనలుగా మార్చుకొని ముందుకు కొనసాగుతామని చెప్పారు.
యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ ప్రారంభోత్సవాన్నికి సంబంధించిన తేదీలపై సీఎంతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, గ్లోబల్ ప్రెజెన్స్ కలిగిన అనేక ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.

