ఆసియన్ గేమ్స్‌లో సూచిక చారిత్రక రికార్డు!

కలం, స్పోర్ట్స్: ఆసియన్ గేమ్స్ 2026 మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) విభాగంలో భారత్ బోణీ కొట్టింది. హర్యానాకు చెందిన 36 ఏళ్ల సూచిక తరియాల్ (Suchika Tariyal) మహిళల 60 కేజీల కేటగిరీలో కాంస్య పతకం సాధించారు. ఆసియన్ గేమ్స్ ఎంఎంఏ చరిత్రలో భారత్‌కు లభించిన మొట్టమొదటి పతకం ఇదే కావడం విశేషం. సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టీవోతో సోమవారం జరిగిన సెమీఫైనల్ బావుట్ తీవ్ర నాటకీయ పరిణామాలకు వేదికైంది. నిర్ణీత సమయంతో పాటు అదనపు నిమిషంలోనూ ఇద్దరు క్రీడాకారిణులు హోరాహోరీగా పోరాడారు.

అయితే, తొలుత ఆర్గనైజర్లు సింగపూర్ క్రీడాకారిణిని విజేతగా ప్రకటించారు. దీనిపై భారత క్యాంప్ వెంటనే అప్పీల్ చేయడంతో, ఆ నిర్ణయాన్ని సవరించి మ్యాచ్‌ను ‘డ్రా’గా తేల్చారు. మ్యాచ్ ఫలితం సమానంగా తేలడంతో విజేతను ఎంపిక చేసేందుకు ఉదయం నిర్వహించిన వెయిట్-ఇన్ నివేదికను పరిశీలించారు. ఇందులో సూచిక కంటే సింగపూర్ ప్లేయర్ 700 గ్రాములు తక్కువ బరువు ఉన్నట్లు తేలింది. నిబంధనల ప్రకారం సింగపూర్ క్రీడాకారిణిని విజేతగా ప్రకటించి ఫైనల్‌కు పంపారు.

దీంతో రింగ్ లోపలే సూచిక కన్నీటిపర్యంతమయ్యారు. సూచిక తరియాల్ ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. 12 ఏళ్ల వయసులో ఈవ్‌టీజింగ్‌ను ఎదుర్కొన్న ఆమె, ఆత్మరక్షణ కోసమే పోరాట విద్యలు నేర్చుకోవడం ప్రారంభించారు. జూడోతో ప్రయాణం మొదలుపెట్టి 8 సార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచారు. ఆ తర్వాత కురాష్, జు-జిట్సు క్రీడల్లోనూ మెరిసి, జు-జిట్సులో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు.

ఇప్పుడు ఎంఎంఏలోనూ ఆసియా స్థాయిలో భారత్‌కు తొలి కాంస్యాన్ని అందించి తన మార్క్ చూపించారు. రింగ్ లోపల అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినా కేవలం బరువు తేడాతో ఫైనల్ అవకాశం చేజారడం బాధాకరమే అయినా, ఆమె సాధించిన ఈ చారిత్రక పతకం భారత క్రీడారంగంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

Also Read : గోల్స్ వర్షం.. రికార్డు మ్యాచ్‌తో భారత్ జోరు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>