కలం, స్పోర్ట్స్: ఆసియన్ గేమ్స్ 2026 (Asian Games 2026) లో భారత మహిళల హాకీ జట్టు జైత్ర యాత్ర కొనసాగుతోంది. పూల్ ‘బి’లో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 17-1 తేడాతో ఇండోనేషియా (India vs Indonesia) ను చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌పై 19-0తో నెగ్గిన భారత్, ఈ విజయం ద్వారా గ్రూప్‌లో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టోర్నీ మొదటి నుంచే భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్ తొలి సగం ముగిసేసరికి భారత్ 9-0 ఆధిక్యం సాధించింది. ఆట ద్వితీయార్థంలో మరో ఎనిమిది గోల్స్ బాదింది. ఇండోనేషియా మూడో క్వార్టర్‌లో ఒకే ఒక్క గోల్ చేయగలిగింది.
భారత ఫార్వర్డ్లు దీపిక, రుతుజ, నవ్‌నీత్ కౌర్ చెరో హాట్రిక్ సాధించారు. సునేలితా, లాల్‌రెమ్‌సియామి, సాక్షి రాణా రెండేసి గోల్స్ చేశారు. కెప్టెన్ సలీమా టెటే, ఇషికా చౌదరి చెరో గోల్ అందించారు. ఈ మ్యాచ్‌తో భారత గోల్‌కీపర్ సవితా పునియా చరిత్ర సృష్టించారు. ఇది ఆమెకు 321వ అంతర్జాతీయ మ్యాచ్. దీంతో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారత మహిళా ప్లేయర్‌గా ఆమె రికార్డుకెక్కారు. లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్ అర్హతకు కూడా కీలకమైన ఈ టోర్నీలో, భారత్ బుధవారం థాయిలాండ్‌తో తదుపరి మ్యాచ్ ఆడనుంది.

