మహాత్మాగాంధీ వర్సిటీ(MG University)లో ఓ అధ్యాపకుడు అక్రమదందాకు తెర లేపాడు. విద్యార్థుల నుంచి శిక్షణ పేరిట డబ్బులు వసూలు చేశాడు. ఆ అక్రమ దందాలో వసూలు చేసిన సొమ్మును ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టి మోసపోయినట్టు సమాచారం. యూనివర్సిటీలోనే ఈ దందా జరగడం గమనార్హం. ఎంజీ వర్సిటీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ ఈ అక్రమదందా చేశాడు. విద్యార్థులు వర్సిటీ వీసీ ఖాజీకు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమదందా వెలుగులోకి వచ్చింది.
దందా సాగిందిలా..
సదరు వర్సిటీ(MG University) ప్రొఫెసర్ టాస్క్ శిక్షణ కోసమంటూ ఇంజినీరింగ్ సెకండర్ విద్యార్థుల నుంచి రూ.700, తృతీయ సంవత్సరం విద్యార్థుల నుండి రూ.400, ఫైనల్ ఇయర్ విద్యార్థుల నుంచి రూ.400 చొప్పున డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. పూర్వ విద్యార్థుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. విద్యార్థుల నుంచి మొత్తం రూ.4.24 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. ఈ దందాలో భాగంగా బోధనా సిబ్బంది నుంచి కూడా మరో 20 లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
గత నెల రోజులుగా వర్సిటీ విధులకు సదరు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హాజరుకాకపోవడం అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ విషయమై యూనివర్సిటీ అధికారులు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ తల్లిదండ్రులను మాట్లాడినట్టు సమాచారం. ఈ విషయమై ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌ను ఫోన్‌లో వివరణ కోరగా ఆమె స్పందించేందుకు నిరాకరించారు. అయితే ఇంత దందా జరుగుతుంటే అక్కడి ఉన్నదాధికారులు ఏం చేస్తున్నారు? విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇంకా ఇటువంటి దందాలు ఏమైనా సాగుతున్నాయా? అన్నది తేలాల్సి ఉంది.
Read Also: సర్పంచ్ బరిలో అనుచరులు.. పల్లెల్లో ఎమ్మెల్యేలు..!
Follow Us on: Facebook


