epaper
Wednesday, February 18, 2026
epaper

టైగర్‌కు దారేదీ..? 500 కిలోమీటర్ల జర్నీ.. ఇక అమ్రాబాదే దిక్కు!

కలం, నల్లగొండ బ్యూరో : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో గత 10 రోజులకు పైగా టైగర్ టెర్రర్ సృష్టిస్తోంది. వ్యవసాయ బావుల వద్ద పశువులు టార్గెట్‌గా దాడులు చేస్తోంది. దీంతో యాదాద్రి జిల్లా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అటవీశాఖ అధికారులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ చిక్కడం లేదు. దీంతో ఎప్పుడు ఏ విషాద వార్త వినాల్సి వస్తుందోనని ప్రజలు వణికిపోతున్నారు. అయితే అసలు ఈ పులి ఇక్కడికి ఎందుకు వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో సంచరిస్తున్న యంగ్ టైగర్.. తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా మహారాష్ట్ర అడవుల నుంచి బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అటవీ శాఖ ట్రాప్ కెమెరాల ఫుటేజీ ఆధారంగా అది మగపులిగా గుర్తించారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ రిజర్వు నుంచి వచ్చినట్టు సమాచారం. అది యాదాద్రి జిల్లాకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇతర ప్రాంతానికి వెళ్లే క్రమంలో అంత దూరం జర్నీ చేసి ఇక్కడ చిక్కుకుపోయింది.

రామగుండం వెళ్లబోయి..!

ఈ యంగ్ టైగర్ మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్ట్ నుంచి ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, ములుగు, కరీంనగర్, జగిత్యాల, సిద్దిపేట మీదుగా యాదాద్రి భువనగిరికి వచ్చినట్టు ఫారెస్ట్ అధికారులు ధ్రువీకరించారు. వాస్తవానికి ఈ పులి రామగుండం అడవుల వైపు వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ అక్కడి మైనింగ్ కార్యకలాపాల నేపథ్యంలో వెనక్కి తిరిగి సిద్దిపేట మీదుగా యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాకు వచ్చిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడికి వచ్చి వేరే మార్గం కనిపించకపోవడంతో వ్యవసాయ పొలాల వద్దే ఉంటూ వస్తోంది.

అమ్రాబాద్ అడవులే శరణ్యం..

యాదాద్రి భువనగిరి జిల్లాలో చిక్కుకుపోయిన యంగ్ టైగర్ నాగార్జునసాగర్ వైపు అమ్రాబాద్ అడవుల్లోకి (Amrabad Forest) వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. కానీ వెళ్లేందుకు సరైన అటవీ మార్గం కన్పించడం లేదు. దీంతో ఈ చుట్టూపక్కలా ప్రాంతాల్లో తిరుగుతోంది. యాదాద్రి జిల్లా నుంచి అమ్రాబాద్ అడవులకు చేరాలంటే.. మరో 200 కిలోమీటర్లు జర్నీ చేయాల్సి ఉంటుంది. అయితే యాదాద్రి నుంచి నాగార్జునసాగర్ వరకు రహదారులు విస్తీర్ణం ఎక్కువగా ఉండడం.. అటవీ మార్గం లేకపోవడం ఆ పులికి సమస్యగా మారింది. ఎప్పటికప్పుడు ఫారెస్ట్ అధికారులు టైగర్ అడుగుజాడలను పర్యవేక్షిస్తున్నప్పటికీ పులి ప్రమాదం బారిన పడే అవకాశం లేకపోలేదు. యాదాద్రి జిల్లా నుంచి మూసీ నది వెంట తుంగతుర్తి నియోజకవర్గానికి చేరుకుని అక్కడి నుంచి నల్లగొండ శివారు ప్రాంతాల మీదుగా నాగార్జునసాగర్ చేరుకోవడం.. లేదా దేవరకొండ ఏరియాకు వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ ఈ స్థాయిలో పులి ప్రయాణిస్తుందా..? లేక అడవి పందుల నుంచి పంటల రక్షణ కోసం రైతులు, వేటగాళ్లు ఏర్పాటు చేసే ఉచ్చులు, కరెంటు తీగలకు చిక్కుకుని బలయ్యే అవకాశం ఉందా..? అన్న అనుమానాలు లేకపోలేదు.

Read Also: రాజ్యసభలో గందరగోళం.. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>