కలం, స్పోర్ట్స్: టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup) టీమిండియా అజేయ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అహ్మదాబాద్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకున్న భారత్, తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే, కేవలం మైదానంలో ఉన్నవారే కాదు, రిజర్వ్ బెంచ్‌పై ఉన్న ఆటగాళ్ల నాణ్యత కూడా ప్రపంచ దేశాలను భయపెడుతోందని ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టీవెన్ ఫిన్ (Steven Finn) వ్యాఖ్యానించారు.
తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఫిన్ .. భారత (Team India) జట్టులోని ‘డెప్త్’ (లోతు) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “టీమిండియా బెంచ్ వైపు ఒక్కసారి చూడండి.. కుల్దీప్ యాదవ్ వంటి స్టార్ స్పిన్నర్ ఈ టోర్నీలో కేవలం ఒక్క మ్యాచులోనే ఆడాడు. నిజానికి కుల్దీప్ వంటి ఆటగాడు ప్రపంచంలోని మరే ఇతర టీ20 జట్టులోనైనా కళ్ళు మూసుకుని తుది జట్టులో చోటు దక్కించుకుంటాడు. కానీ భారత్ వద్ద అంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉండటంతో అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు” అని ఫిన్ పేర్కొన్నారు.
భారత జట్టులో ఉన్న ఈ అపారమైన ప్రతిభను ‘టెర్రిఫైయింగ్’ అని ఫిన్ అభివర్ణించారు. ఇతర దేశాలు భారత్‌తో పోటీ పడాలంటే ఈ స్థాయి బెంచ్ బలాన్ని పెంచుకోవాలని, లేదంటే ఈ వ్యత్యాసం ఇంకా పెరుగుతూనే ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో ఇంగ్లాండ్ మాజీ స్టార్ స్టువర్ట్ బ్రాడ్ కూడా ఫిన్ (Steven Finn) వ్యాఖ్యలను సమర్థించారు. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ వంటి దిగ్గజాలే లేని జట్టు ఇంత బలంగా ఉందంటే, అది ఐపీఎల్ అందించిన గొప్ప వరమని బ్రాడ్ విశ్లేషించారు.
Read Also: ఫుల్‌టైమ్ డీజీపీపై డిస్కషన్… నేడు ఢిల్లీకి సీఎస్
Follow Us On: Facebook

