కలం, వరంగల్ బ్యూరో: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యమని, ఆ లక్ష్య సాధనలో ప్రజల సహకారం ఎంతో అవసరమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) స్పష్టం చేశారు. అందుకు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. సోమవారం స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషాతో కలిసి ఆయన రూ.7 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రస్తుతం చేపట్టిన పనులతో పాటు మరో వారం రోజుల్లో రూ.11 కోట్ల వ్యయంతో లైబ్రరీ, మున్సిపాలిటీ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ రూ.50 కోట్ల పనులన్నింటినీ ఏడాది కాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ముఖ్యమంత్రిని కోరి మరో రూ.50 కోట్లు మంజూరు చేయిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తద్వారా మొత్తం రూ.100 కోట్లతో మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులకు గాను వార్డుకు 25 చొప్పున మొత్తం 450 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. నియోజకవర్గానికి మొత్తం 3,500 ఇళ్లు రానున్నాయని తెలిపారు.
రాజకీయ స్వార్థం కోసం కొందరు అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారని, గతంలో పనులు, పదవులను అమ్ముకున్న వారు ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారని విపక్షాలపై కడియం శ్రీహరి (Kadiyam Srihari) మండిపడ్డారు. అభివృద్ధి కొనసాగాలంటే ప్రభుత్వ సహకారం అవసరమని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: జిల్లాలు రద్దు చేస్తే అగ్గి పుట్టిస్తాం.. కేటీఆర్ ఫైర్
Follow Us On: Sharechat


