కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌కు (CM Vijay) డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్ అభినందనలు చెబుతూనే.. ఫస్ట్ కౌంటర్ ఇస్తూ పోస్ట్ పెట్టారు. “భారీ విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీవీకే పార్టీకి, కొత్త ముఖ్యమంత్రి విజయ్‌కు అభినందనలు. అలాగే, బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే, ఇచ్చిన హామీలకు శ్రీకారం చుట్టడాన్ని కూడా ఆహ్వానితున్నాం. అయితే, ప్రభుత్వం వద్ద చిల్లిగవ్వ లేదంటూ పాలన ప్రారంభించడాన్ని సమర్థించబోం. కచ్చితంగా ప్రభుత్వం వద్ద డబ్బులున్నాయి. దాన్ని ప్రజలకు ఇవ్వాలన్నా సంకల్పం, ప్రభుత్వాన్ని నడిపే సమర్థత అవసరం. మొదటి అయిదేళ్లలో మేం లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాం. కొవిడ్, వరదలు వచ్చినా.. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా.. ఏనాడూ పథకాలు ఆపలేదు” అని స్టాలిన్ స్పష్టం చేశారు.
“హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా..”
విజయ్ మొదటి ప్రసంగంలోనే గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పు చేసి, ఖజానా ఖాళీ చేసిందని ఆరోపించడంపైనా స్టాలిన్ . “తమిళనాడు అప్పు పరిమితికి మించే ఉందని స్పష్టంగా చెబుతున్నా. గత ఫిబ్రవరి బడ్జెట్‌లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి పూర్తిగా వివరించాం. ఈ విషయం మీకు తెలియదా? మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించవద్దు. అలాగే, సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. నాకు సాధ్యమైనంత మేర మాత్రమే హామీలను అమలు చేస్తాను అని చెప్పడం ఇచ్చిన హామీల నుంచి పక్కకు జరగడమే. మాలాగే.. ఇచ్చిన హామీలను అమలు చేయడం ఎలా అనేది త్వరలోనే నేర్చుకుంటానని భావిస్తున్నా. ఈ ఓటర్ల మాదిరే, నేను కూడా మీ నుంచి అదే ఆశిస్తున్నా. మరోసారి, మీ నాయకత్వంలో తమిళనాడు గొప్ప అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు.

