కలం, వెబ్ డెస్క్ : ప్రధాని మోదీ (PM Modi) తెలంగాణ పర్యటన వేళ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. 8 అంశాలను ప్రస్తావిస్తూ బహిరంగ లేఖ రాశారు. వీటిలో హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం, విభజన హామీలు లాంటి ప్రధాన అంశాలను లేఖలో పేర్కొన్నారు.
1. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ
హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తున్నందునా.. ట్రాఫిక్ ఒత్తిడి, ప్రజా రవాణా అవసరాలు పెరుగుతున్నాయని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో విస్తరణను అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా ఎంచుకుందన్నారు. ఇప్పటికే మెట్రో ఫేజ్–1 విస్తరణకు అడ్డంకులు తొలిగిపోవటంతో ఫేజ్–2 విస్తరణకు కేంద్రం తక్షణం ఆమోదం తెలపాలని కోరారు.
2. మూసీ నది పునరుజ్జీవనం
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు కేంద్రం తగిన సహకారం అందించాలని టీపీసీసీ చీఫ్ కోరారు. మూసీలోకి చేరుతున్న మురుగునీటిని నియంత్రించడం, నది తీరాలను అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని.. కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలన్నారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు జాతీయ స్థాయి అర్బన్ రివర్ పునరుద్ధరణ ప్రాజెక్టుగా పరిగణించి కేంద్రం త్వరగా నిధులు, అనుమతులివ్వాలని కోరారు.
3. రీజినల్ రింగ్ రోడ్
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అభివృద్ధికి కీలకమైన రీజనల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగానికి కేబినేట్ ఆమోదంతో పాటు ఫైనాన్సియల్ అప్రూవల్ ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు అనుమతులు వెంటనే మంజూరు చేయాలన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్‌పై రవాణా ఒత్తిడి తగ్గి, చుట్టుపక్కల జిల్లాల్లో పెట్టుబడులు, ఉపాధి, రవాణా సౌకర్యాలు పెరుగుతాయని ఆయన లేఖలో వివరించారు.
4. రీజనల్ రింగ్ రైలు
రీజనల్ రింగ్ రోడ్డు వెంట ప్రతిపాదనల్లో ఉన్న రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును వీలైనంత తొందరగా చేపట్టాలని, వంద శాతం కేంద్రం నిధులతోనే ఈ ప్రాజెక్టు నిర్మించాలని మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు.
5. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే
హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగుళూరు హై స్పీడ్ కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టేందుకు కేంద్రం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
6. రేడియల్ రోడ్లు
అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు కొత్త పారిశ్రామిక మండలాలు, ఐటీ క్లస్టర్లు, టౌన్‌షిప్‌లు, లాజిస్టిక్ హబ్‌లు అభివృద్ధి చేసేందుకు వీలుగా రేడియల్ రోడ్లను నిర్మించాల్సి ఉందన్నారు. రేడియల్ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ.45 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని వెల్లడించారు. వీటిని రాష్ట్ర రోడ్లుగా కాకుండా, జాతీయ అభివృద్ధి కారిడార్లుగా పరిగణించాలని టీపీసీసీ చీఫ్ కోరారు.
5. హైదరాబాద్ సిగ్నల్ ఫ్రీ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నందునా నగరాన్ని సిగ్నల్ ఫ్రీ, ట్రాఫిక్ రిలీఫ్ నగరంగా మార్చే ప్రాజెక్టు కేంద్రం ఆర్థిక సాయం అందించాలని మహేశ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లు, జంక్షన్ అభివృద్ధి, ప్రధాన జాతీయ రహదారుల విస్తరణకు నిధులివ్వాలన్నారు.
6. సెమీకండక్టర్ ప్రాజెక్టులు – ఫ్యాబ్ సిటీ
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఫ్యాబ్ సిటీ, ఫ్యూచర్ సిటీ పరిసరాలను సెమీకండక్టర్–ఎలక్ట్రానిక్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని టీపీసీసీ చీఫ్ వెల్లడించారు. రాష్ట్రంలో భూమి, విద్యుత్, మౌలిక వసతులు, నైపుణ్య మానవ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద తెలంగాణకు తక్షణ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు.. ఇప్పటికే కేంద్ర పరిశీలనలో ఉన్న ప్రాజెక్టులకు తుది ఆమోదం తెలపాలని లేఖలో ప్రస్తావించారు.
7. తుమ్మిడిహెట్టి – మహారాష్ట్ర నో అబ్జెక్షన్
తెలంగాణలోని మెట్ట ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో సాగు నీటిని, తాగునీటిని అందించే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలని మహేశ్ గౌడ్ కోరారు. అంతరాష్ట్ర సమన్వయం అవసరమైనందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ముందుకు సాగేలా కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని మోదీకి విన్నవించారు.
8. విభజన హామీలు – పెండింగ్ అంశాలు
తెలంగాణ ఏర్పడి ఇన్ని సంవత్సరాలు గడిచినా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల్లో అనేక అంశాలు ఇంకా పూర్తిగా అమలు కాలేదని మహేశ్ గౌడ్ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వీటిని కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ రైల్వే లైన్లకు ఆమోదం తెలపాలన్నారు. కొత్త జిల్లాలకు జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు త్వరగా మంజూరు చేయాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు.
బీజేపీ మంత్రులు, ఎంపీలు ఈ అంశాలపైన ప్రధాని మోదీ పైన ఒత్తిడి తీసుకువచ్చి వెంటనే అనుమతులు వచ్చేలా చూడాలన్నారు. అంశాలపైన స్పష్టత ఇస్తేనే తెలంగాణ పైన ప్రధాని మోదీకి, బీజేపీకి ప్రేమ ఉన్నట్లు అని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.

